YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వన్ సైడా ... టూ సైడ్

వన్ సైడా ... టూ సైడ్

తిరుపతి,జూన్ 21,
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్‌సైడ్‌ లవ్‌ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ శిబిరం నుంచి వస్తున్న స్వరం మారిపోయింది. ఎలాంటి పొత్తులు అక్కర్లేకుండా ఒంటరిగా వెళ్దామనే చర్చ పసుపు శిబిరంలో జరుగుతోంది. అయితే ఆ అంశంపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడటం లేదు. అలా అని జనసేనను వదులుకునే స్థితిలో లేరని టాక్‌. ఈ అంశం తెలిసినప్పటి నుంచి టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. ఆ ఆందోళన చుట్టూనే జిల్లాల్లో చర్చ ఆసక్తిగా మారుతోంది.టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు తప్పదు. జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాపు సామాజికవర్గం ఓట్లను బేస్‌ చేసుకుని జనసేనను దువ్వే పనిలో ఉంది టీడీపీ. జనసేన కావాలి. కాపుల్ని వదులుకోలేం. అలాగని జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేస్తే ఏమిటి పరిస్థితి అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే జనసేన అడిగిన అన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా అనేది మరో ప్రశ్న. ఏతావాతా చర్చలు కొలిక్కి వచ్చాక కొన్ని సీట్లు అయితే జనసేనకు ఇవ్వాల్సిందే. అక్కడ టీడీపీ నేతలు సీట్లను వదులుకుని మిత్రపక్షానికి మద్దతు తెలిపాల్సిందే. అయితే జనసేన అడిగే సీట్లు ఏంటన్నదే ప్రస్తుతం టీడీపీ నేతలను కలవర పెడుతోందట. ముఖ్యంగా ఉభయ గోదావర జిల్లాల్లోని టీడీపీ నేతలు పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఉలిక్కి పడుతున్నట్టు తెలుస్తోంది.ఉమ్మడి తూర్పుగోదారి జిల్లాలో ప్రస్తుతం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత లెక్కలను చూస్తే 2009లో పీఆర్పీ నాలుగు సీట్లు గెలుచుకుంది. కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. ప్రస్తుతం ఉన్న 19 నియోజకవర్గాల్లో 9 చోట్ల మాత్రం టీడీపీ శిబిరంలో గట్టిగా చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, తుని, కొత్తపేట, పిఠాపురం, రాజమండ్రి రూరల్‌, ముమ్మిడివర్గం, రాజోలు, జగ్గంపేట సీట్ల చుట్టూ ఆ చర్చ హీటెక్కుతోంది. 2019 ఎన్నికల్లో రాజోలులో జనసేన గెలిచింది. ప్రస్తుతం చర్చ జరుగుతున్న సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గట్టిగా పోరాడి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అవ్వాలని చూస్తున్నారు కొందరు నాయకులు. జనసేనతో పొత్తు ఓకే అయితే ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. మూడేళ్లుగా పడిన కష్టం గంగలో కలిసిపోతుందని ఆవేదన చెందుతున్నారట.పొత్తులో భాగంగా ఉభయగోదారి జిల్లాల నుంచే ఎక్కువ సీట్లు అడగాలని జనసేన చూస్తోందట. గెలుపోటములను కాపులు ప్రభావితం చేసే నియోజకవర్గాలనే అడిగే అవకాశం ఉండటంతో చర్చ హీటెక్కుతోంది. జనసేన, టీడీపీ కలిస్తే.. కాపుల ఓట్లు పడటంతోపాటు.. టీడీపీ ఓటు బ్యాంక్‌ కూడా కలిసి వస్తుందని జనసైనికులు భావిస్తున్నారు. అయితే సీటు వదులుకోవాలేమోనని ఆందోళన చెందుతున్న టీడీపీ నేతలకు ఎక్కడా ఊరట దక్కడం లేదట. తరచూ అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పిఠాపురంలో టీడీపీని వర్మ, కొత్తపేటలో బండారు సత్యానందం, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ.. తునిలో యనమల తదితరులు లీడ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆందోళనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారట అక్కడి నాయకులు. అంతా ఒక టీమ్‌గా ఏర్పడుతున్నట్టు సమాచారం. మొత్తానికి పొత్తు కుదరకముందే ప్రకంపనలు వస్తున్నాయి. ఒకవేళ పొత్తు ఖరారైతే.. ఈ సమస్యను రెండు పార్టీల అగ్రనేతలు ఎలా డీల్‌ చేస్తారో చూడాలి

Related Posts