విజయవాడ, జూన్ 21,
జగన్ సర్కార్ లో మేకలను బలిపశువులను చేస్తున్నారు. పై స్థాయిలో జరిగిన తప్పులకు కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారు. తాజాగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అదే జరిగింది. కోర్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అందుకు బాధ్యులను చేస్తూ ఇద్దరు కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేశారు. మరో అధికారికి చార్జి మెమో ఇచ్చారు. అసలు విషయమేమిటంటే ఉపాధి పనుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై కోర్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు చెల్లించకుంటే ఎలా అని నిలదీసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో ఈ నెల 14న కోర్టుకు హాజరైన గోపాలకృష్ణ ద్వివేదిపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. హై కోర్టును ఆదేశించినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించరా అంటూ నిలదీసింది. కాగా బిల్లుల చెల్లింపులో జాప్యానికి కారణంగా చూపుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం పంచాయతీరాజ్ డివిజన్ ఎఈ రమేష్ బాబు, డివిజనల్ అక్కౌంట్స్ అధికారి వీపీ సుబ్బారావులపై గోపాలకృష్ణ ద్వివేది సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే డీఈఈ కే. ఆదినారాయణకు చార్జి మెమో ఇచ్చారు. పిటిషనర్ పూర్తి చేసిన రోడ్డు పనిపై తొలుత క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీ చేసి, నాణ్యత లోపం ఉందంటూ రికవరీ పెట్టిన విషయాన్ని ప్రస్తావించకపోవడానికి, ఇంజినీర్లు సమాచారం ఇవ్వకపోవడమే కారణమని ముఖ్య కార్యదర్శి నిర్ధారణకు వచ్చి, వీరి కారణంగా హైకోర్టులో ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు, ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కొన్నామని ఆ సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇరువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ వెలువరించిన జీవో శనివారం వెలుగులోనికి వచ్చింది. ఉపాధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై, హైకోర్టు ఆయనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాఖా పరంగా ఇటువంటి తీవ్ర చర్యలు తీసుకోవడంపై సంబంధిత వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రతికూల పరిస్థితుల్లో, తీవ్రమైన ఒత్తిడితో పని చేస్తున్న ఇంజినీర్లను చేయని తప్పునకు బలిపశువులను చేస్తున్నారని ఇంజినీర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ మురళీకృష్ణనాయుడు డిమాండ్ చేశారు.