YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్పీపై వేటుకు అదే కారణమా..

ఎస్పీపై వేటుకు అదే కారణమా..

కాకినాడ, జూన్ 21,
గత నెల 24న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టవద్దని చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆ అల్లర్లలో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆందోళనకారులను.. వారు చేసే విధ్వంసాన్ని పోలీసులు అంచనా వేయలేకపోయారు. ఈ సందర్భంగా కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి తీరు చర్చకు వచ్చింది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 72 రోజుల తర్వాత ఆయన్ని బదిలీ చేశారు. దీంతో అమలాపురం అల్లర్లు.. తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఎస్పీ వేటుకు దారితీసిన సంఘటనలు పోలీస్‌ వర్గాల్లోనూ చర్చకు కారణం అయ్యాయి. డైరెక్ట్‌ ఐపీఎస్ కాదు. అందువల్లే డిపార్ట్‌మెంట్‌పై ఆయన పట్టు సాధించలేకపోయారనే విమర్శ ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఆయనకు ఎస్పీగా అవకాశం వచ్చింది. కానీ.. పూర్తి స్థాయిలో కమాండింగ్‌ చేయలేక ఇబ్బంది పడ్డారని చెబుతారు. కొన్ని సందర్బాలలో డీఎస్పీ స్థాయి అధికారి కూడా ఎస్పీ సుబ్బారెడ్డి చెప్పిన ఆదేశాలు పాటించేవారు కాదని పోలీస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే అమలాపురం అల్లర్ల తర్వాత డీఐజీ పాలరాజును రంగంలోకి దించారని విశ్లేషిస్తారు. గత నెల 24నే ఆయన అమలాపురం చేరుకుని.. అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా పని చేసి.. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రబాబును కూడా అమలాపురం పంపించారు.అల్లర్ల తీవ్రత ప్రపంచం మొత్తం చూసినా.. డీజీపీ స్థాయి అధికారులు అమలాపురం రాకపోవడంతో మంత్రి విశ్వరూప్‌ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. దాంతో ఘటన జరిగిన 15 రోజుల తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అమలాపురం వచ్చారని చెబుతారు. ఆందోళనకారులు తగులబెట్టిన మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను డీజీపీ పరిశీలించారు. ఆ తర్వాత ఎస్పీ ఆఫీసులో అల్లర్లపై సమీక్ష నిర్వహించారు డీజీపీ. సమగ్ర వివరాలు ఇవ్వాలని అప్పటికప్పుడు ఎస్పీ సుబ్బారెడ్డిని ఆదేశించారు డీజీపీ. అంతా DIGనే చూస్తున్నారని సంజాయిషీ ఇస్తూ.. ఆ ఘటనపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదట ఎస్పీ. దాంతో మీ జిల్లా పరిధిలోని విషయాలు మీకు తెలియకపోతే ఎలా అని ఎస్పీపై సీరియస్‌ అయ్యారట డీజీపీ.నలుగురు అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని స్వయంగా మంత్రి విశ్వరూప్‌ ఎస్పీకి చెప్పారట. దర్యాప్తు చేసి క్లారిటీ ఇవ్వాలని కోరారట. ఆ విషయంలోనూ సుబ్బారెడ్డి చూసీచూడనట్టు వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమలాపురం వచ్చిన డీజీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారట మంత్రి. విచిత్రం ఏంటంటే.. డీజీపీ వచ్చి వెళ్లిన మరుసటి రోజే విశ్వరూప్‌ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కేర్‌లెస్‌గా వ్యవహరించడం ఏంటని ఎస్పీకి డీజీపీ క్లాస్‌ తీసుకున్నారట. ఆ తర్వాత సుబ్బారెడ్డిని బదిలీ చేశారని చర్చ జరుగుతోంది.మొత్తానికి ఎస్పీ బదిలీ వేటుకు ముందు జరిగిన ఘటనల కంటే.. తర్వాత జరిగిన పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. డీజీపీకి కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో ఎస్పీని పక్కన పెట్టారని అనుకుంటున్నారట. మొత్తానికి అసలు కథ ఇదా అని ఖాకీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట.

Related Posts