విజయవాడ, జూన్ 22,
టీడీపీ ఆవిర్భవించినప్పుడు యూత్ లుక్ ఎక్కువ. తర్వాత యువతను ప్రోత్సహించిన సందర్భాలు అరుదే. తెలుగుదేశం ఆవిర్భవించిన 40 ఏళ్ల తర్వాత… రాబోయే ఎన్నికల్లో 40 శాతం మంది యువతకే ప్రాధాన్యం అన్నది ప్రస్తుతం చంద్రబాబు మాట. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. దీనికితోడు ఇంఛార్జుల పేరుతోనో.. సీనియర్లు అనే హోదాలోనో చాలా మంది లీడర్లు ఎక్కడికక్కడ పాతుకుపోయారు. వారు పనిచేయరు.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వరు అనే విమర్శలు పసుపు శిబిరంలోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 40 శాతం యువతకే అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 70 వరకు కొత్తవాళ్లకే ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ యంగ్ థియరీని అమలు చేసే పరిస్థితిలో టీడీపీ ఉందా అనేది పార్టీ వర్గాల అనుమానం. ఈ మధ్య కాలంలో చంద్రబాబు పార్టీ కోఆర్డినేటర్లతో వరసగా సమావేశం అవుతున్నారు. వారికి అప్పగించిన నియోజకవర్గాల్లో కనీసం 40 శాతం కొత్త అభ్యర్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. యువతను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని చంద్రబాబు చెబుతున్నారట. ఈ క్రమంలో సైలెంట్‌గా ఉన్న సీనియర్లు బయటకొస్తున్నారు. హడావిడి చేస్తున్నారు కూడా. ఇందుకు కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలను పార్టీ వర్గాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. ఆ మధ్య గుడివాడలో తనకు తప్ప టీడీపీకి వేరే ఆప్షన్ లేదని అనుకునేవారు రావి వెంకటేశ్వరరావు. కానీ.. అక్కడ శిష్టలా లోహిత్‌ను పార్టీ ప్రోత్సహిస్తుండటంతో రావి శిబిరంలో గుబులు మొదలైందట. ఇదే విధంగా గుంటూరు జిల్లాలోనూ చంద్రబాబు దృష్టి ఒక యువనేతపై పడిందట. దాంతో పెదకూరపాడులోని టీడీపీ నేతలు గుమ్మం దాటి బయటకొస్తున్నారట. అయితే వారిని పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు మూడు సెగ్మెంట్ల విషయంలోనూ ఇదే విధమైన చర్చ నడుస్తోంది.ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం, మాడుగుల, యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల్లోనూ ఇదే విధమైన ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఇంఛార్జులుగా సెకండ్ లీడర్‌షిప్పే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న చర్చ ఏంటి అనేదానిపై చర్చకు అధినేత ఆస్కారం ఇవ్వడం లేదు. యలమంచిలిలో గత ఎన్నికల్లో ఓడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరిపోయారు. అక్కడ పప్పల చలపతిరావు ఉన్నప్పటికీ ప్రగడ నాగేశ్వరరావును ఇంఛార్జ్‌ను చేసింది టీడీపీ. చోవడరంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన రాజు అస్త్ర సన్యాసం చేయడంతో.. బత్తుల తాతయ్యబాబుకు నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు అప్పగించారు. ఇంతలో జిల్లా మహానాడు పేరుతో మాజీ ఎమ్మెల్యే రాజు తెరపైకి రావడంతో టీడీపీ శిబిరంలో చర్చ మొదలైంది. ఇక మాడుగులలో మూడు ముక్కలాట సాగుతోంది. భీమిలిలో ఇంఛార్జ్ కోరాడ రాజబాబుకు టికెట్ ఇస్తారో లేదో అని కేడర్‌కే అనుమానం ఉందట.అనకాపల్లిలో నిర్వహించిన సమీక్షల్లో ఇంఛార్జుల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు అభిమానులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టడం కనిపించింది. అభ్యర్థులను ఇప్పుడే తేల్చేస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసుకోవడానికి సాధ్యపడుతుందని కొందరు ప్రతిపాదించారట. అయితే మూడేళ్లుగా పత్తా లేని నాయకులు ఇప్పుడు బయటకు రావడం ఇంఛార్జులను కలవర పెడుతోందట. మొత్తానికి సీనియర్లను నొప్పించకుండా యువతకు ప్రాధాన్యం ఇవ్వడం చంద్రబాబుకు సవాలే అన్నది పార్టీ వర్గాల మాట. మూడేళ్లుగా బద్ధకంగా ఉన్న నేతలను రోడ్డెక్కించడానికి మాత్రం యూత్ థియరీ ఉపయోగపడిందని భావిస్తున్నారు. మరి.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను చంద్రబాబు ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.