ఒంగోలు, జూన్ 22,
ణానికో మాట మాట్లాడేవారితో స్నేహం కష్టమే. పూటకో విధంగా వ్యవహరించేవారి దోస్తానా ప్రమాదకరమే! ఈ రెండు అంశాలూ ఇప్పడు నప్పేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కే! కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు ఆయన వ్యక్తం చేస్తున్న భిన్నాభిప్రాయా లతోనే ముడిపడ్డాయి. ఇంతకీ ఆయన మనసులో ఏముంది? పొత్తుల విషయంలో స్పష్టత లేని డైలాగులు ఎవరు రాసిస్తున్నారు వంటి పలు అనుమానాలు ఏపీలో అన్ని వర్గాలకూ, పార్టీలకూ వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే జనసేన లక్ష్యమన్న పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని అన్నారు. వైసీపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధమనే సంకేతం ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ టీడీపీ నేతలు మాట్లాడటం.. త్యాగాలకు సిద్ధమంటూ టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్ చేయడం తో ఏపీలో పొత్తులు ఖాయమనే ప్రచారం సాగింది.ప్రస్తుతం ఏపీలో బీజేపీ- జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా వున్న జనసేన అందుకు ఏ పార్టీతో నైనా కలిసేందుకు రెడీ అన్నారు పవన్. అయితే పవన్ చంద్రబాబు దత్తపుత్రుడని వైసీపీ ఆరోపిస్తోంది. జనసేన నేతలు తమ అధినేతను సీఎంగా చేసేట్టయితే ఏ పార్టీతోనైనా ముందడుగు వేస్తామని అసలు సంగతి బయటపెట్టారు. ఎందుకంటే వేరెవరికో మద్దతునిచ్చి గెలిపించగల సత్తా వున్నప్పుడు పీఠం ఎక్కేందుకు అవకాశాలను లాక్కోవాలని తమకూ వుంటుందని వారి అభిప్రాయం. కానీ ఈ విషయమై టిడీపీ మౌనం వహించింది.రాజకీయాల్లో ఎంతో అనుభవం వున్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసి జనాదరణ పొందిన చంద్రబాబు ఈ పర్యాయం ఘన విజయం సాధించి సీఎం అవుతారన్న మాట అంతటా వినపడుతు న్నపుడు పవర్ స్టార్ వీరాభిమానులు, ఆయన పార్టీవారి మాటను పట్టుకుని చేతులు కలుపుతారని ఎవ్వరూ అనుకోరు. కాబోతే జనసేనతో పొత్తు ఆశిస్తున్న టీడీపీ కి జనసేన అధినేత పొత్తు ఈసారి కుదరకపోవచ్చునని అనడం ఓట్ల చీలికకే ఆయన అడుగులు అన్నది అర్ధమ యింది. మరోసారి వైసీపీకి ఛాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని పవన్ అన్నారు. గత పాలకులను చూసిన ప్రజలు జన సేనకు ఒకసారి అధికారం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని పవన్ వ్యాఖ్యానిం చారు. ప్రస్తుతం పొత్తులపై మాట్లాడబోనన్న జన సేన చీఫ్ తన పొత్తులు జనంతోనే ఉంటాయన్నారు. గతంలో వైసీపీని ఓడిం చేందుకు విపక్షాలు ఏకం కావాలనే సంకేతం ఇచ్చిన పవన్.. ఇప్పుడు మాత్రం ప్రజలతోనే పొత్తు ఉంటుందని చెప్పడం చర్చగా మారింది. అంతేకాదు జనసేనకు అధికారం ఇవ్వాలని జనాలు కోరుకుంటున్నారంటూ పరోక్షంగా తానే సీఎం అభ్యర్థిని అనడం కాస్తంత హాస్యపూరితమయిన మాట! మరోవైపు పొత్తు విషయంలో టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటం దన్న పవన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. ఇది కూడా పవన్ యూటర్న్ తీసుకోవ డానికి కారణమనే ప్రచారం సాగుతోంది. ఈ విధంగా పూటకో మాటను ఏదో ఆదేశిస్తున్నట్టు అనడం, ఎవరిచేతనయినా అనిపిం చడం వల్ల స్నేహం చేద్దామని దగ్గరికి వచ్చే వారికంటే జనసేన నేతకే నష్టం. పాపం ఆయనకు ఈ సంగతి ఎవరు చెప్పుతారో!