YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ

పాపం.. 30  ఇయర్స్ ఇండస్ట్రీ

విజయవాడ, జూన్ 22,
టాలీవుడ్ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ గుర్తున్నారుగా? అవును, ఆ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. 2019 ఎన్నికలకు ముందు  వైసీపీలో  చేరిన ఆయన, కొద్ది కాలం పాటు ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అ ఎన్నికలలో  పార్టీ గెలుపు కోసం, చాలాచాలా కష్ట పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ, ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. పనిలో పనిగా,  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్’ గా విమర్శలు గుప్పించారు. నోరుంది ఎందుకంటే, రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించే అందుకే  అన్నట్లు విరుచుకు పడ్డారు. ఆయన ప్రచారం పనిచేసిందో, రాష్ట్ర ప్రజల దురదృష్టమో కానీ, ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృద్వీ’ జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో కానీ, జగన్ రెడ్డి ఆయనకు మరీ మొండి చేయి చూపించకుండా, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవితో సరిపెట్టారు. ఇక అక్కడి నుంచి పృద్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత పెద్దగాతిడితే, అంతగా ముఖ్యమంత్రి దృష్టిలో పడొచ్చని. మరో మెట్టు ఎక్కచ్చని అనుకున్నారో ఏమో కానీ, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు, అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి. అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే, పృద్వీ ఎస్వీబీసే వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది. ఒక మహిళకు ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే, అక్కడి నుంచి థర్టీ ఇయర్స్’ కు కష్టాలు మొదలయ్యాయి. ఒకసారి ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత, వైసీపీలో ఆయన్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది. అదేదో ముతక సామెతలో చెప్పినట్లుగా, ఉన్నదీ పోయి, ఉంచుకున్నడీ పోయి, పృద్వీ రోడ్డున పడ్డారు. కొంచెం ఆలస్యంగానే అయినా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది. అప్పట్లోనే తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రపన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు పృథ్వీ, ఇప్పడు   పక్క చూపులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు., గెలవలేకపోయారని అంటున్నారని.. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు ... 2024 ఎన్నికలలో  జనసేన 40కి పైగా స్థానలలో విజయం సాధిస్తుందని భవిష్యవాణి వినిపిస్తున్నారు. అయితే, గతంలో ఇదే పృద్వీ అందరి కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైనే వ్యక్తిగత విమర్శలు గుప్పించారని, జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో ఇవ్వన్నీ మాములే ... ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని సమర్ధించడంతో పాటు ప్రత్యర్ధి పార్టీలను విమర్శించక తప్పదని ,అందుకు మంత్రి రోజానే, నిదర్శనం అంటున్నారు.నిజమే, టీడీపలో ఉన్నప్పడు రోజా .. జగన్ రెడ్డినే కాదు, వైఎస్’ను కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.  కానీ, ఇప్పడు ఆమె జగన్ రెడ్డికి  సొంత చెల్లెలు కంటే ఎక్కవ .. అయితే, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ స్టొరీ కొంచెం  డిఫరెంట్ అంటున్నారు. ఇప్పటికైతే పృద్వీ కథ విషాదపు మలుపులో వుంది .. భవిష్యత్ ఎలా ఉంటుందో .. ఏమలుపు తిరుగుతుందో చూడవలసి ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Related Posts