తీవ్ర నాటకీయ పరిస్థితుల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా అంశాన్ని ప్రకటించారు బీజేపీ నేత యడ్యూరప్ప. ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని, అయితే అపవిత్ర కలయిక తమ ప్రభుత్వాన్ని కొనసాగనీయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికీ సేవ చేయాలని తను అనుకున్నానని అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల అపవిత్ర కలయిక వల్ల తను రాజీనామా చేస్తున్నాను అని ఆయన ప్రకటించారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించనున్నట్టుగా అసెంబ్లీలో ప్రకటించి అక్కడ నుంచి వెళ్లిపోయారు ఈ బీజేపీ నేత. యడ్యూరప్ప రాజీనామాతో కర్ణాటక కథ క్లైమాక్స్‌కు వచ్చినట్టు కాదు. కొంత రాజకీయ నాటకం మాత్రమే ముగిసింది. ఇక అసలు కథ మరింత ఉంది. యడ్యూరప్ప రాజీనామాతో కుమారస్వామికి కొంత వరకూ లైన్ క్లియర్ అయినట్టే. యడ్యూరప్ప రాజీనామాతో కుమారస్వామి చేత గవర్నర్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించే అవకాశాలున్నాయి. ఇది వరకే కుమారస్వామి వెళ్లి గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్‌తో కలిసి తమకు మినిమం మెజారిటీ ఉందని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన కోరారు. గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ ప్రయత్నాలు విఫలం అయ్యాయి కాబట్టి.. గవర్నర్ కుమారస్వామికి అవకాశం ఇవ్వవచ్చు. ఈ రకంగా చూస్తే కుమారస్వామికి పూర్తిగా లైన్ క్లియర్ అయినట్టే. అయితే, కర్ణాటక రాజకీయ పరిణామాల్లో మాత్రం దేన్నీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కుమారస్వామి తక్షణం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, ఆయన కూడా బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్‌లు తమ క్యాంప్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో మినిమం మెజారిటీని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అంత వరకూ రాజకీయ ప్రతిష్టంభన, ఉత్కంఠ కొనసాగడం ఖాయం!