న్యూఢిల్లీ, జూన్ 22,
కౌన్‌బనేగా రాష్ట్రపతి.. దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నిక ఇది. దేశానికి తదుపరి రాష్ట్రపతి ఎవరు అనే దానిపై రాజకీయాలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం అందరి దృష్టి రాష్ట్రపతి అభ్యర్థులపైనే ఉంది. ప్రతిపక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగనున్నారు. ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. యశ్వంత్ సిన్హా చేసిన ట్వీట్ నుంచి దీని గురించి ఊహాగానాలు వచ్చాయి. అందులో పెద్ద జాతీయ ప్రయోజనం కోసం ఇప్పుడు తాను పార్టీని విడిచిపెట్టి ప్రతిపక్ష ఐక్యత కోసం పని చేయాలని నిర్ణయించకున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హా ఎవరో తెలుసా…యశ్వంత్ సిన్హా 1937 నవంబర్ 6న పాట్నాలోని కాయస్థ కుటుంబంలో జన్మించారు. అతను రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. ఆ తర్వాత 1960 వరకు పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరాలనే కోరిక కలిగింది. అందుకే ఆయన ఐఏఎస్ కోసం ప్రిపరేషన్ కొనసాగించారు. 1960లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ సమయంలో అతను అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఈ సమయంలో యశ్వంత్ సిన్హా.. బీహార్ ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖలో సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీగా రెండు సంవత్సరాలు పనిచేశారు. దీని తరువాత అతను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ పదవికి నియమించబడ్డారు. యశ్వంత్ సిన్హా తన పదవీ కాలంలో భారత రాయబార కార్యాలయంలో కూడా ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. అతను 1971 నుంచి 1974 వరకు జర్మనీలోని భారత రాయబార కార్యాలయానికి మొదటి కార్యదర్శిగా నియమించబడ్డారు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉన్న యశ్వంత్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1986లో జనతా పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. 1988లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.1989లో జనతాదళ్‌తో ఆయన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత, పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశారు. 1990-91లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 1998 నుంచి 2002 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2002లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. యశ్వంత్ సిన్హా 2009లో బీజేపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2018లో బీజేపీని వీడి 2021లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్‌లో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.