కన్నడ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కర్ణాటకలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని... బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని వ్యాఖ్యానించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో బీజేపీ తీరు దారుణమని... ఇప్పుడు కర్ణాటకలో ఇప్పుడు అదే చేస్తోందని విమర్శించారు. ఆ రెండు రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవసస్థలు విఫలమయ్యాయని... కర్ణాటకలో మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక మాదిరిగానే ఏపీని చేయాలని చూస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు.కనీసం ఎమ్మెల్యేలు వెళ్లకుండా విమానాలను అడ్డుకోవడం కూడా దారుణమన్నారు ఏపీ సీఎం. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గాలి జనార్థన్ రెడ్డి బేరసారాలు జరిపారని... అప్రజాస్వామిక విధానాలతో దేశానికి ఏం సంకేతాలిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మోదీ, అమిత్ షా చెప్పిందేంటి... ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. దేశాన్ని ఉద్దరించేస్తామని చెప్పిన పార్టీలు, నేతలు... కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు ఏపీ సీఎం.