భువనేశ్వర్, జూన్ 22,
దేశానికి కాబోయే భారత రాష్ట్రపతి ఎవరు? అధికార భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని పోటీకి పెడుతుంది? ఎవరు బరిలోకి దిగబోతున్నారు? అనే చర్చ ఆసక్తికరంగా సాగింది.. ఈ సమయంలో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.. అయితే, అనూహ్యంగా జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ముకు కేంద్రం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాచు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి నేటి నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. ముర్ము నేడు ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లో ఉన్న శివాలయానికి వెళ్లారు. అక్కడ స్వతహాగా చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు. అనంతరం స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె చీపురు పట్టుకుని శుభ్రం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రౌపది ముర్ము..: 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జన్మించిన ద్రౌపది.. శ్యామ్ చరణ్ ముర్మును పెళ్లి చేసుకున్నారు.. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా.. భర్త, ఇద్దరు కుమారులు మృతిచెందడం ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది.. అయినా.. ఆ బాధను దిగమింగుకుని ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి టీచర్ ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ద్రౌపది.. 1997లో ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్ జిల్లా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ముర్ము సరిగ్గా అదే సంవత్సరం రాయరంగ్‌పూర్ వైస్-ఛైర్‌పర్సన్ అయ్యారు. 2000 అసెంబ్లీ ఎన్నికలలో, ఆమె అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.2002 వరకు రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా చేశారు. ఒడిశా ప్రభుత్వం ఆమెకు 2002లో ఫిషరీస్ మరియు పశుసంవర్ధక శాఖను అప్పగించింది.. ఆమె 2004 వరకు ఆ పదవిలో పనిచేశారు.. ముర్ము 2002 నుండి 2009 వరకు మయూర్‌భంజ్ జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2004లో, ఆమె రాయంగ్‌పూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకు పనిచేశారు. భారతీయ జనతా పార్టీ ఆమెను 2006లో ఒడిశా షెడ్యూల్డ్ తెగ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపిక చేసింది.. 2009 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆమె మళ్లీ 2010లో మయూర్‌భంజ్ జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 2013లో ఆమె మూడోసారి అదే జిల్లాకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలయ్యారు. ఆమె ఏప్రిల్ 2015 వరకు ఈ పదవిలో ఉన్నారు. ఇక, ఆమె ఎన్నిక లాంఛనమే అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది బీజేపీ.