కాకినాడ, జూన్ 23,
తూర్పుగోదావరి జిల్లాలో గత జులై నుంచి అక్టోబర్ మధ్య నాలుగుసార్లు తుపాన్లు, భారీ వర్షాలు వచ్చి రైతులు రూ.కోట్ల విలువైన పంటలను నష్టపోయారు. ఆయా సందర్భాల్లో పంటలను కోల్పోయిన రైతులకు పరిహారం అందించేందుకు అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో పంటలు నష్టపోయిన వారిలో కొందరికి పరిహారం చెల్లించింది. మిగిలిన వారికి నేటికీ పరిహారం అందలేదు. సుమారు పది కోట్ల రూపాయలు పరిహారం పెండింగ్ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో వరితోపాటు పత్తి, మొక్కజన్న, అపరాల పంటలకు నష్టం వాటిల్లింది. వరి, పత్తి పంటలకు ఎకరాకు రూ.15 వేలు, అపరాలు, మొక్కజన్నకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారంగా ప్రభుత్వం నిర్ణయించింది. 33 శాతానికిపైగా పంట నష్టం జరిగితేనే పరిహారం కోసం ప్రభుత్వానికి అధికారులు సిఫార్సు చేశారు. కరోనా నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఎదుర్కొంటున్న తమకు బకాయిలు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.2019 జులై, ఆగస్టులో 18 మండలాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు రూపొందించారు. 5,207 మంది రైతులకు చెందిన 5,240 ఎకరాల్లో వరి, 458.65 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.3.46 కోట్ల నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇదే ఏడాది సెప్టెంబర్‌లో నాలుగు మండలాల్లో 465 మంది రైతులకు చెందిన 770 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, రూ.45.86 లక్షలు పరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్‌లో 16,100 మంది రైతులకు చెందిన 17,144.6 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. రూ.10.25 కోట్ల నష్టపరిహారం కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2020 ఏప్రిల్‌లో ఆరు మండలాల్లో 286 ఎకరాల్లో వరి, నాలుగు ఎకరాల్లో అపరాలు, రెండు ఎకరాల్లో మొక్కజన్నకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రూ.17.42 లక్షల పరిహారం మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి నివేదించారు.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నష్టపోయిన వారిలో సుమారు 40 శాతం మంది రైతులకు మాత్రమే వారి ఖాతాల్లో సొమ్ము జమ అయినట్లు సమాచారం. ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం సక్రమంగా లేకపోవడంతో వారిలో కొందరికి పరిహారం డబ్బులు పడలేదని, వాటిని సరిచేసే పనిలో ఉన్నామని అధికారులు చెప్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కెఎస్‌వి.ప్రసాద్‌ను వివరణ కోరగా, త్వరలో అందరికీ పరిహారం అందుతుందని తెలిపారు.