YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేట్ సంస్థకు సీనరేజ్ వసూళ్లు

ప్రైవేట్ సంస్థకు సీనరేజ్ వసూళ్లు

గుంటూరు, జూన్ 23,
ఏపీ సర్కార్ కు వేల కోట్లలో లీజులు ఇస్తున్న శాఖకు నామమాత్రపు సీనరేజ్‌ వసూలు చేయడం మాత్రం బరువైపోతోందట. అందుకే ఈ బాధ్యతలను ప్రయివేటుకు అప్పగిస్తారట! వసూళ్లు చేసిపెట్టే సంస్థలకు కమిషన్‌ రూపంలో ఆదాయాన్ని సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు గనుల శాఖ తెరపైకి తీసుకువచ్చింది. ఇక ఖనిజాలను తీసుకువెళ్లే వాహనాలు బరువు చెక్‌చేసుకునే వేయింగ్‌ మిషన్లను కూడా ప్రయివేటుకు కట్టబెట్టాలని దాదాపుగా నిర్ణయించింది.కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 6388 గనులను లీజుకు ఇచ్చారు. ఇప్పటివరకు వీటిపై అధికారం మైనింగ్‌ శాఖకే ఉంది. అయితే ఖనిజ రవాణా, సీనరేజ్‌లను వసూలు చేయడం శాఖలోని సిబ్బందికి కష్టంగా మారుతున్నట్లు ఆ శాఖ చెబుతోంది. సరైన దృష్టి సారించకపోవడం వల్ల ఆర్ధికంగా నష్టం వాటిల్లుతున్నట్లు చెబుతున్నారు. అందుకే జిల్లాను ఒక యూనిట్‌గా గుర్తించి అక్కడ సీనరేజ్‌ వసూళ్ల బాధ్యతలను ప్రయివేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికి థర్డ్‌ పార్టీ అని ఒక ముద్దు పేరు కూడా పెట్టనున్నారు. ఇలా ప్రయివేటుకు వసూళ్ల బాధ్యత అప్పగించడం వల్ల 35 నుంచి 40 శాతం అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సీనరేజ్‌ ద్వారా గత మూడేళ్లలో సగటున రూ.1,261 కోట్లు ఆదాయం వస్తుండగా, ప్రయివేటుకు అప్పగించడం ద్వారా రూ.1,765 కోట్లు వస్తుందని అధికారులు అరచనా వేస్తున్నారు. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1643 కోట్లు వసూలైన విషయం గమనిస్తే ఇది ప్రయివేటుకి ఇచ్చిన తరువాత వచ్చే అంచనా ఆదాయంకన్నా 122 కోట్లు మాత్రమే తక్కువ.గనుల తవ్వకాల అనంతరం ఖనిజాన్ని రవాణా చేసే సమయంలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు చాలాకాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీనిని గుర్తించడంలో, అరికట్టడంలో ఆ శాఖ సిబ్బంది విఫలమవుతున్నారు. అయితే ఇది నిర్లక్ష్యం కాదని, ఒత్తిడి వల్లనే అని చెబుతున్న అధికారులు తరలింపు సమయంలో వాటి బరువును తూచేందుకు గనులకు సమీపంలోనే వేబ్రిడ్జిలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తోంది. అయితే ఇవి కూడా ప్రయివేటు రంగం ద్వారానే ఏర్పాటుచేయాలని భావిస్తుండడం విశేషం. వేబ్రిడ్జిల వద్ద, క్వారీల వద్ద సిసి కెమేరాలను కూడా ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తున్నారుగ్రానైట్‌ వంటి ఖనిజాలపై సీనరేజ్‌ను వసూలు చేసే సమయంలో వాటి ఘనపుటడుగులు, విస్తీర్ణం ఆధారంగా లెక్కించేవారు. అయితే తాజాగా ఖనిజం బరువు ఆధారంగా సీనరేజ్‌ను లెక్కించాలన్న కొత్త ప్రతిపాదన కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. ఖనిజ విస్తీర్ణం కన్నా బరువును ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల సీనరేజ్‌ లెక్కలు పక్కాగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఈ విధానంతో 25 శాతం ఆదాయం అదనంగా పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఖనిజాల అక్రమ రవాణాకు చెక్‌ పెట్టవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ఆదాయం పెరిగినా ప్రయివేటుకు బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రభుత్వం కొంత కమిషన్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రవాణా చేసే వారి నుంచి ప్రయివేటు సంస్థలు కమిషన్‌ తీసుకుంటే అది వినియోగదారులపై ఆర్ధికంగా ప్రభావం పడుతుందని అంటున్నారు.

Related Posts