YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కృష్ణా, గుంటూరుపై ప్రత్యేక శ్రద్ద

కృష్ణా, గుంటూరుపై ప్రత్యేక శ్రద్ద

విజయవాడ, జూన్ 23,
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటనకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 29న గుడివాడలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ నిర్వహించే మినీ మహానాడులో టీడీపీ అధినేత పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు బహిరంగ సభకు స్థలాలను కూడా మాజీమంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో నాలుగు ప్రాంతాలను రవీంద్ర పరిశీలించారు. లక్షలాది మందితో గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. చంద్రబాబు బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.30న మచిలీపట్నంలోని ఓ కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం అవుతారని తెలుస్తోంది. అటు గుంటూరు జిల్లాలోనూ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. జూలై 1న ప్రత్తిపాడులో, పొన్నూరులో చంద్రబాబు పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ప్రజల భవిష్యత్‌కు భరోసా కల్పించేలా చంద్రబాబు జిల్లాల ప‌ర్యటన ఉంటుందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఏడాది పాటు 100కు పైగా అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల్లో ప‌ర్యటిస్తానని గతంలోనే ప్రకటించారు చంద్రబాబు.ఈ నేపథ్యంలోనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. వీటి తర్వాత ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు లేదా, రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన ఉండనున్నట్టు సమాచారం. జిల్లాల పర్యటనలు, పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా చంద్రబాబు షెడ్యూల్‌ను రూపొందించారు టీడీపీ నేతలు.
గుడివాడ గడ్డ నుంచే చాలెంజ్
తెలుగుదేశం పార్టీ గుడివాడ నడి బొడ్డున మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మహానాడును నెలాఖరులో గుడివాడలో ఖరారు చేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఆ జిల్లాలోనే బస చేసి పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నారు. గుడివాడలోనే మహానాడు పెట్టాలని నిర్ణయించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కొడాలి నాని విషయంలో టీడీపీ క్యాడర్ అసహనంతో ఉన్నారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై ఇష్టారీతిన తిట్లతో విరుచుకుపడే వంశీకి ఈ సారి బుద్ది చెప్పాలన్న లక్ష్యంతో ఎక్కువ మంది ఉన్నారు. అయితే గుడివాడలో సరైన అభ్యర్థి లేకుండా పోయారు. రావి కుటుంబం నుంచి మార్చి కొడాలి నానికి చంద్రబాబు చాన్సు ఇచ్చిన తర్వాత టీడీపీ తరపున రెండు సార్లుఆయన గెలిచారు. కొడాలి దెబ్బకు రావి కుటుంబం రాజకీయంగా సైలెంట్ అయిపోయింది. కొడాలి పార్టీ మారిన తర్వాత రావి వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు. ఆయన ఓ సారి నిలబడి ఓడిపోయారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్‌కు టీడీపీ చాన్సిచ్చింది. అయితే ఆయన కూడా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ రావి కుటుంబానికే చాన్సివ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుడివాడలో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడే మహానాడు పెట్టి .. భయపడేది లేదని ప్రతీ దానికి బదులు చెల్లిస్తామని హెచ్చరికలు పంపితేనే క్యాడర్‌లో కదలిక వస్తుందని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మహానాడును గుడివాడలో ఖరారు చేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు అక్కడే ఉండి… గుడివాడ అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉంది. కొడాలిపై ఉన్న వ్యతిరేకత గుడివాడలో మహానాడులో కనిపించే అవకాశం ఉంది.

Related Posts