YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజు గారి పదవీ గండం....

రాజు గారి పదవీ గండం....

విజయనగరం, జూన్ 24,
సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆహ్వానితులుగా అధికారపార్టీకి అనుకూలమైన వ్యక్తులు నామినేట్ అయ్యారు. పాలకమండలి కూర్పు ప్రభుత్వ నిర్ణయాధికారమే అయినప్పటికీ.. అది కొలువుతీరిన తీరు చర్చగా మారింది. చైర్మన్‌గా అశోక్ గజపతిరాజుకు ఆహ్వానం లేకుండానే అధికారులు కథ నడిపించేశారు. ఈ అంశాన్ని అశోక్‌ సీరియస్‌గా తీసుకుని న్యాయ సలహా కోరడంతో ట్రస్ట్ బోర్డు సమావేశంలో అధికారులు క్షమాపణ చెప్పారు. అయితే.. అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయని భావిస్తున్నారట అశోక్ గజపతిరాజు.మాన్సాస్ ట్రస్ట్ భూముల వివాదంలోనే గతంలో అశోక్‌ను పదవీచ్యుతుణ్ణి చేసింది వైసీపీ సర్కార్. ఆ ప్లేస్‌లో వచ్చిన సంచయితా గజపతిరాజు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అశోకే అనువంశిక ధర్మకర్తగా కోర్టు తేల్చడంతో సంచయిత కనిపించకుండా పోయారు. ఇక వివాదాలకు తావులేదని.. అంతా సింహాద్రి అప్పన్న సేవలో భాగం అవుతారని భావించారు. అయితే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి నుంచి తనను తొలగించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోందని అశోక్‌ చేసిన కామెంట్స్‌ చర్చగా మారాయి. లోగుట్టు ఆరా తీసే పనిలో పడ్డారు కొందరు.సింహాచలం దేవస్ధానంలో పంచగ్రామాల భూ సమస్య జఠిలమైన వివాదం. సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతోంది. భీమిలి, పెందుర్తి, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలతో ముడిపడి వున్న ఈ సమస్యను పరిష్కరిస్తామని గత ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చింది. ఆ దిశగా కసరత్తు చేసినా పీఠముడులు వీడలేదు. పంచగ్రామాల పరిధిలో వేల మంది జీవిస్తుండగా.. దేవస్ధానం ఆంక్షలు కారణంగా అక్కడ ఇళ్లకు మరమ్మతులు లేవు. ఆ భూములు దేవస్థానం ఆస్తో.. తమ సొంతమో తేలక రైతులు నరకం అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో పంచగ్రామాల్లో భూములను అనుభవదారులకు రెగ్యులరైజ్ చేసి.. ఆ మేరకు భూమిని ప్రత్యామ్నాయంగా దేవస్ధానానికి కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. ఐతే, భూమికి భూమి బదలాయించడం వల్ల ఆలయానికి నష్టం వస్తుందనేది కొందరి వాదన. ప్రస్తుతం పంచగ్రామాల పరిధిలో గజం విలువ 20 వేల పైమాటే. అదే మార్కెట్ విలువ ఆధారంగా సింహాద్రి అప్పన్నకు భూముల కేటాయింపు జరగాలనేది ప్రతిపాదన. ఇది అమలు కావాలంటే ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా ఎండోమెంట్ యాక్ట్ ఎంత వరకు సహకరిస్తుందో కూడా చూడాలనేది నిపుణుల మాట.పంచగ్రామాల అంశంలో ముందడుగు పడాలంటే ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు నిర్ణయం కీలకం. ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ధర్మకర్తల మండలి తీసుకోలేదన్నది అశోక్‌ మాట. అందుకే రిస్క్‌ తీసుకోలేనని ఆయన చెప్పేశారు. సభ్యుల ప్రతిపాదన పంపితే న్యాయపరమైన సలహాలు తీసుకుని.. చట్టబద్ధంగా ఉంటే ఆమోదించడానికి అభ్యంతరం లేదని ట్రస్ట్‌బోర్డుపై భారం పెట్టేసి చేతులు దులుపుకున్నారు. అయితే ట్రస్టుబోర్డు సభ్యులను తీర్మానం చేయాలని చెబుతూనే.. తనను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. అశోక్‌ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే, అశోక్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదంటున్నారు ట్రస్ట్ బోర్డు సభ్యులు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వ ఆలోచనలను, వ్యూహాలను పసిగట్టడంలో ఇప్పుడు అశోక్ గజపతిరాజు రెండు అడుగులు ముందే ఉన్నారట. వారసత్వం వివాదంలో సంచయిత తెరమరుగైన తర్వాత అందరి దృష్టీ ఆనంద గజపతిరాజు చిన్న కుమార్తె ఊర్మిళ గజపతిపైనే ఉంది. ట్రస్ట్ బోర్డు సమస్య వచ్చాక తమ అస్తిత్వం కాపాడుకోవడానికి ఆనంద్ కుటుంబం ప్రయత్నించింది. పూసపాటి సంస్ధానంలో తమ వారసత్వ హక్కులను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ తరుణంలోనే ఇటీవల ఆసక్తికరమైన సీన్ కనిపించింది. కొన్నేళ్లుగా ఎవరికి వారుగా సింహాచలం చందనోత్సవం రోజు స్వామివారి దర్శనానికి వస్తున్న అశోక్, ఆనంద్ కుంటుబాలు ఈ ఏడాది కలిసి వచ్చాయి. దీంతో ప్రభుత్వం మరోసారి పదవీ గండం తీసుకుని వస్తే ధీటుగా ఎదుర్కోవడానికి అశోక్ గజపతిరాజు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారట. మరి.. రాజకీయ వైకుంఠ పాళీలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

Related Posts