YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివాదాల సుడిగుండంలో తిరుమల

వివాదాల సుడిగుండంలో తిరుమల

కలియుగ దైవం తిరుమలేశుని సన్నిది ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. అధికారులు, అర్చకుల ఆధిపత్య పోరుతో అట్టుడికి పోతున్నది. ఇది గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్న విషయమే అయినప్పటికీ ఇప్పుడు తారాస్థాయికి చేరి కట్టలు తెంచుకుంది. టీటీడీలో అదికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నిత్యం విఐపీల సేవల్లో తరిస్తున్నారని... అగమశాస్త్రాలు ప్రక్కనపెట్టి స్వామి కైంకర్యాల్లో తలదూర్చుతూ ఉన్నారని సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరున్ని తన స్వహస్తాలతో ప్రతి నిత్యం కైంకర్యాలు, అలంకరణలు చేసే ప్రదాన అర్చకుడు రమణదీక్షితులు అన్నారు. ఇది విన్న ప్రపంచంలోకి తిరుమలేశుని భక్తులు షాక్ తిన్నారు. నిజంగా తిరుమల ఆలయంలో అదికారుల పెత్తనం ఇంత దారుణంగా నడుస్తుందా అని ముక్కున వేలేసుకున్నారు. ఇలా బహిరంగంగా మీడియాకు వచ్చి లీకులు ఇచ్చిన రమణ దీక్షితులపై టీటీడీ అధికారులు ప్రతీకారం తీర్చుకున్నారు. 65 సంవత్సరాలు నిండిన వారిని చట్టప్రకారం విధుల్లో ఉండకూడదు అనే కోణంలో నోటీసులు ఇచ్చి ఇంటికి పంపారు. దీంతో ఇప్పుడు తిరుమలలో రమణదీక్షితులకి, టీటీడీ దేవస్థానం యాజమాన్యానికి యుద్దమే నడుస్తుంది. తిరుమల కు 1900 దశకం నుండి ఆదాయం బాగా రావడం ప్రారంభమైనది. అప్పటి బ్రిటిష్ పాలకులు కూడా స్వామివారి పట్ల మంచి శ్రద్దనే చూపారు. క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ నిర్వహణ కు కొంతమంది అధికారుల అవసరం ఉందని గుర్తించి కలెక్టర్ స్థాయి అధికారిని బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. తరువాత వారే హథీరాం జి మఠానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు చేయడం దర్శన వేళలు పర్యవేక్షణ వారి బాధ్యతలు. 1950 లో తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనకు ప్రత్యేక పాలకమండలి అధికారులను ప్రభుత్వం నియమించడం ప్రారంభమయింది. కానీ ఎవరు స్వామి వారి కైంకర్యాల విషయాలలో కలగజేసు కునేవారు కాదు. ఎన్టీ రామారావు  ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు  అర్చక వ్యవస్ధ గురించి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ సిఫార్సు పరిగణన లోకి తీసుకున్న ప్రభుత్వం అర్చకులకు వంశపారంపర్య హక్కు తీసివేసి ద్రవ్య ఆదాయ స్థానంలో జీతాలు ఇస్తామన్నాది. దీంతో తిరుమల అర్చకులు కోర్టు మెట్లు ఎక్కారు. 1987నుండి. 1996 వరకు 9 సంవత్సరాల కాలం కోర్టులో కేసు జరిగింది. ఈ 9 సంవత్సరాలు టీటీడీ,  రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నారు. 996 లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ వంశ పారంపర్య హక్కు అర్చకులకు లేదని కానీ ప్రస్తుతం ఉన్నవారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని వారికి ద్రవ్య ఆదాయం మినహా అన్ని గౌరవ మర్యాదలు ఇవ్వాలని ఆగమ కైంకర్యాలు వారు చెప్పినట్లే నిర్వహించాలని సూచించింది. తరువాత కొన్ని మార్పులు జరిగాయి. అర్చకుల జీతభత్యాలు కుడా పెరిగాయి. ఆదే సమయంలో అధికారుల పెత్తనం కుడా పెరిగిపోయింది. మొత్తంగా చూస్తే ప్రభుత్వం, టిటిడి ప్రణాళిక ప్రకారమే అర్చకులకు 65 ఏళ్ల వయో పరిమితిని తెరపైకి తెచ్చి, రమణ దీక్షితులుపై వేటు వేసిందా అనే అనుమానాలు కొందరికి వస్తున్నాయి. వాస్తవంగా ఆయనకు ఇప్పడు 70 ఏళ్లు. 65 ఏళ్ల తరువాత అర్చకులు పని చేయకూడదని అనుకుని వుంటే ఐదేళ్ల క్రితమే ఆయన్ను రిటైర్ చేసి వుండాల్సింది. అప్పడు పట్టించు కోకుండా ఆయన తీవ్రమైన విమర్శలు చేసినపుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే వివాదాస్పదం అవుతోంది.

Related Posts