విజయవాడ, జూన్ 25,
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన్ని హుటాహుటిన ఢిల్లీ రావాలని చెప్పడం.. ఆ తర్వాత అమిత్ షా తదితరులు వెంకయ్య దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆయనే తదుపది రాష్ట్రపతి అభ్యర్థిగా అందరూ భావించారు. సంఖ్యా పరంగా ఎన్డీయేకు రాష్ట్రపతిని గెలిపించుకునే బలం ఉండటంతో.. చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి పీఠంపై తెలుగువ్యక్తి.. వెంకయ్య నాయుడు కూర్చోబోతున్నారని సంతోషించారు తెలుగు రాష్ట్రాల జనం. కానీ.. బీజేపీ మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక లెక్కల పేరుతో కమలనాధులు చేసిన వడపోతలపై ముఖ్యంగా తెలుగువారితోపాటు… మరీ ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం చాలా గుర్రుగా ఉంది.వెంకయ్య నాయుడు మొదటి నుంచీ బీజేపీలోనే ఉన్నారు. తనను తాను కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా ఎప్పుడూ చెప్పకపోయినా.. ఆ సామాజికవర్గంలో మాత్రం వెంకయ్యకు చాలా పెద్ద స్థానమే ఉంది. ఆ కోణంలోనే కమ్మ సామాజికవర్గానికి చెందిన చాలా మంది బీజేపీకి దగ్గరైన పరిస్థితి.. అలాగే ఎన్నికల్లో ఆదరించే వాతావరణం కనిపించేది. కానీ.. ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆ వర్గాన్ని తీవ్రంగా నిరాశపర్చడంతోపాటు.. కమలంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో ఆంధ్రాలోని కమ్మ సామాజికవర్గం ఒక విధంగా కుతకుతలాడుతోంటే.. తెలంగాణలోని కమ్మ సామాజికవర్గం మరో విధంగా ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆలోచన. ఇందుకు ప్రత్యేక ఆపరేషన్ కూడా చేపట్టింది. అయితే వెంకయ్యను రాష్ట్రపతిని చేయకపోవడంతో.. గుర్రుగా ఉన్న ఆ సామాజికవర్గం ఎన్నికల్లో బీజేపీకి ఎంత వరకు సహకరిస్తుంది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న.తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ. అలాగే రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా కొన్ని సెగ్మెంట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఆ వర్గం ఓటర్లు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. స్థానికంగా ఉన్న కమలనాథులు సైతం ఈ ప్రమాదాన్ని గ్రహించి మల్ల గుల్లాలు పడుతున్నారట. ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ అగ్రనాయకత్వం కూడా గుర్తించినా.. బయట పడటానికి సంకోచిస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారట నాయకులు.రాజకీయ కోణంలో చూసినా.. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో వెంకయ్య నాయుడికి రాజకీయ పరిచయాలు ఎక్కువ. పార్టీలకు అతీతంగా ఆయన్ని గౌరవిస్తారు. ఆంధ్రా, తెలంగాణలో అయితే కమ్మ సామాజికవర్గంతోపాటు మిగతా వర్గాలు కూడా వెంకయ్య రాష్ట్రపతి అయితే చూడాలని అనుకున్నాయి. అందుకే వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిని చేసుంటే.. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సానుకూల వాతావరణం ఏర్పడేదని.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్టీ మరింత బలోపేతానికి బాట పడేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ లెక్కలేవీ పరిణనలోకి తీసుకోకుండా బీజేపీ నాయకత్వం తప్పులో కాలేసిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశంలో గడిచిన రెండు ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ గట్టి పట్టే సాధించింది. దక్షిణాదిలో పాగా వేయడానికి వేయని ఎత్తులు జిత్తులు లేవు. అదే వెంకయ్యను రాష్ట్రపతిని చేసి ఉంటే.. ఆంధ్రా, తెలంగాణలో కమ్మ సామాజికవర్గం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతోపాటు.. రాజకీయంగా బీజేపీకి కూడా కలిసి వచ్చేదని చెబుతున్నారు. వివాదరహితుడైన వెంకయ్యను కేవలం కమ్మ సామాజికవర్గమే కాకుండా తెలుగు వారంతా ఓన్ చేసుకుంటారు. ఆ విధంగా చూసినా.. బీజేపీకి రాజకీయంగా ప్లస్సే అయ్యేదని కొందరి వాదన. కానీ.. ఒకే ఒక్క నిర్ణయం.. బీజేపీపై ఒక సామాజికవర్గం ఆగ్రహానికి.. తెలుగువారిలో అసంతృప్తికి దారితీసింది.