రాజమండ్రి, జూన్ 25,
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ఓ విధంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న విషయమై కాకుండా ఎవరు పోటీ చేస్తారు అన్న విషయమై ఇప్పటి నుంచే కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. రాజకీయం అన్నాక ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రాసుకోవాలి కనుక జగన్ పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ కొత్త ముఖాలు సందడి చేస్తూనే ఉంటున్నాయి ఎప్పటికప్పుడు ! ఆ క్రమంలో కొత్తగా మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు జనసేన గూటికి చేరుకున్నారు. ఆయన ప్రభావం పార్టీపై ఏ విధంగా ఉండనుంది అన్నదే ఆసక్తిదాయకం.జనసేనాని పవన్ గూటికి మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ (స్వస్థలం : రాజోలు నియోజకవర్గం, దిండి గ్రామం) చేరారు. దీంతో ఆ పార్టీలో మరో చర్చ మొదలవుతోంది. వచ్చే ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఆయనేనా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాదరావు (జనసేన టికెట్ పొందారు గత ఎన్నికల్లో ఈయన) పార్టీని కాదని వెళ్లిపోయారు. దీంతో పవన్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు.వైసీపీ వర్గాలకు చేరువగా ఉంటూ ఇప్పుడు రాజకీయం చేసుకుంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ మరోసారీ రాజోలు నియోజకవర్గం విషయం వార్తల్లోకి వచ్చింది.వాస్తవానికి గత ఎన్నికల్లో పవన్-తో పాటే ఉంటూ, ఆయన పార్టీ తరఫున విశాఖ ఎంపీ స్థానానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేశారు. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి అని తెలుస్తోంది. ఈయన్ను నెత్తిన పెట్టుకుంటే రాపాక మాదిరి పార్టీకి హ్యాండ్ ఇచ్చి వెళ్లరని ఏంటి గ్యారంటీ అన్న అనుమానాలూ వస్తున్నాయి. రాపాక వర ప్రసాదరావు మాదిరి అంతా ఆ విధంగా రాజకీయం చేస్తారని అనుకోవద్దని, పార్టీని నమ్ముకుని పనిచేసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారని కనుక ఇటువంటి అధికారులనుమేలు చేసే విధంగా పార్టీ పటిష్టతకు ఉపయోగపడేవిధంగా వాడుకోవాలని ఇంకొందరు సూచిస్తున్నారు.