YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ట్రబుల్ షూటర్ మౌనం వెనుక

ట్రబుల్ షూటర్  మౌనం వెనుక

ముంబై, జూన్ 25,
రాజకీయాల్లో తలపండిన నేత. ఎన్నో రాజకీయ సంక్షోభాలను చూశారు. ఎన్నింటిలోనో తాను ట్రబుల్ షూటర్ గా మారి పరిస్థితులను చక్కదిదద్దారు. మూడు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయంగా చివరి దశలో ఉన్నప్పటికీ పాలిటిక్స్ లో ఎత్తులు వేయడంలో దిట్ట. ఆయనే మరాఠా యోధుడిగా శరద్ పవార్ కు పేరు. మహారాష్ట్ర రాజకీయాలను గుప్పిట పట్టిన పవార్ కు ప్రస్తుత సంక్షోభం మింగుడు పడటం లేదు. దీన్ని నుంచి బయట పడేందుకు ఆయనే చివరి వరకూ పోరాటం చేస్తూనే ఉంటారు. ఏదీ అంత సులువుగా వదులుకోరు. తాను అందులో సక్సెస్ కాకపోయినా ఆయన పట్టించుకోరు. కానీ చివరి వరకూ పోరాడటం శరద్ పవార్ నైజం. కాంగ్రెస్ నుంచి చీలిక వస్తుందేమోనని తొలి నుంచి శరద్ పవార్ అనుమానించారు. అందుకే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సమాచారం అందిస్తూ మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోకుండా చూడగలిగారు. శివసేన నుంచి చీలిక వస్తుందని శరద్ పవార్ ఊహించనే లేదు. ప్రాంతీయ కుటుంబ పార్టీ కావడం, ఉద్ధవ్ కు గ్రిప్ ఉండటంతో ఆయన అనుమానించలేకపోయారు. ఆ ఊహే ఆయన దరిచేరలేదు.శివసేనలో చీలిక వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయాలనుకున్నారు. అప్పటికే ఉద్దవ్ ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే వెంటనే పవార్ ఫోన్ చేసి రాజీనామా ఆలోచనను విరమింప చేశారు. రాజీనామా చేస్తే వెంటనే గవర్నర్ బలనిరూపణకు బీజేపీకి అవకాశం ఇస్తారు. అదే జరిగితే ప్రభుత్వం వెంటనే కుప్ప కూలిపోవడం ఖాయం. అలా కాకుండా పార్టీని థిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటువేయాలని, అందులో 12 మందిని గుర్తించి వారిపై వేటు వేయాలని పవార్ ఉద్ధవ్ కు సూచించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్సీపీకి చెందిన వారే కావడంతో సులువుగా అనర్హత వేటు వేయచ్చని నచ్చచెప్పారు. దీంతో ఉద్ధవ్ రాజీనామా చేయకుండా నివారించగలిగారు. ముంబయికి వస్తే శివసేన ఎమ్మెల్యేల్లో మార్పు వస్తుందని శరద్ పవార్ ఆశిస్తున్నారు. వారిపై వత్తిడి పెంచే అవకాశముంటుంది. అప్పటి వరకూ ప్రభుత్వం ఉండాలి. ఇటు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఒత్తిడి పెంచగలిగితే కొందరినైనా వెనక్కు రప్పించవచ్చన్నది పవార్ ఆలోచన. అంతేకాకుండా రోజులు గడిచే కొద్దీ రెబల్ ఎమ్మెల్యే ఆలోచనల్లో మార్పు వస్తుందని భావించారు. కానీ రోజురోజుకూ రెబల్స్ క్యాంప్ లోకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువవుతుంది. కానీ శరద్ పవార్ కు ఆశలు ఇంకా ఉన్నాయి. ఏదో జరిగి ప్రభుత్వం నిలబడుతుందన్న నమ్మకంతో ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. శివసేన కార్యకర్తలు, రెబల్స్ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేలా ప్లాన్ చేయాలని ఇప్పటికే శివసేన నాయకత్వానికి సూచించారు. కానీ పవార్ అనుకున్నట్లు జరగకపోవచ్చు. కానీ పవార్ మాత్రం తన ప్రయత్నాలు మాత్రం చివరి నిమిషం వరకూ మానుకోరన్నది ఆయనను దగ్గర నుంచి చూసిన వారెవరికైనా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts