బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప కథ ముగిసింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ యడ్డీకి.. అది ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. 2007లో8రోజులు, 2008లో 3సంవత్సరాల 2 నెలలు, ఇప్పుడు 55గంటలు మాత్రమే సీఎంగా కొనసాగారు. ప్రస్తుతం సాధారణ మెజార్టీ కోసం యడ్యూరప్ప చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ నేతలతో జరిపిన బేరసారాలు ఫలించలేదు. దీంతో బలపరీక్ష కంటే ముందే యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేశారు.యడ్యూరప్ప తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టిన సమయంలో కేవలం 8 రోజులు మాత్రమే సీఎంగా కొనసాగారు. 2007 నవంబర్ 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడ్డీ.. జేడీఎస్ సహకారంతో సంకీర్ణ పాలనకు శ్రీకారం చుట్టారు. కానీ జేడీఎస్ మద్దతుకు అంగీకరించకపోవడంతో 8 రోజులకే యడ్యూరప్ప పదవికి కోల్పోవాల్సి వచ్చింది.ఇక రెండోసారి 2008అసెంబ్లీ ఎన్నికల్లో శికారిపురి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మే30న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అక్రమ మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తూ కర్ణాటక లోకాయుక్త సీఎం యడ్యూరప్ప పేరును చేర్చడంతో బీజేపీ అధిష్టానం ఒత్తిడి మేరకు 2011 జులై 31న సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు 3సంవత్సరాల 2నెలలు సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇక ఇప్పుడు సాధారణ మెజార్టీ లేకపోవడంతో బలపరీక్ష కంటే ముందే యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేశారు. 2018లో సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప కేవలం 55గంటలు మాత్రమే సీఎంగా కొనసాగారు.అనేక మలుపులు.. ఎన్నో ఎత్తుగడలు.. క్యాంపు రాజకీయాలు.. నరాలు తెగే ఉత్కంఠ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప కథ ముగిసింది. బలపరీక్షలో నెగ్గడానికి ఏడుగురు ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో బలపరీక్షకు వెళ్లకుండానే యడ్యూరప్ప వెనుదిరిగారు. అసెంబ్లీలో ఉద్వేగ పూరిత ప్రసంగం చేసిన అనంతరం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం యడ్డీ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించడానికి వెళ్లారు.
దీంతో కాంగ్రెస్, జేడీఎస్ శిబిరాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కుమారస్వామే తమ సీఎం అంటూ అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు విక్టరీ సింబల్స్ చూసిస్తూ నినాదాలు చేశారు. మొత్తం అనూహ్య మలుపుల అనంతరం కర్ణాటకలో రాజకీయ వేడి చల్లారింది. ఇక మిగిలింది కుమార స్వామిని ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ పిలవడం, అనంతరం ఆయన తన బలాన్ని నిరూపించుకోవడం జరుగాల్సి ఉంది.