రాజమండ్రి, జూన్ 27,
రాష్ట్రమంతా రాజకీయం ఒక తీరున ఉంటే.. ఈ మూడేళ్లలో రాజోలు పాలిటిక్స్ మాత్రం ప్రత్యేకం. రాష్ట్రంలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చాలా వేగంగా వైసీపీకి జైకొట్టేశారు. అప్పటి నుంచి మూడేళ్లుగా రాజోలు వైసీపీ రాజకీయం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ఇంఛార్జులు మారిపోయారు. నేతల మధ్య సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు. ఈ గొడవల మధ్య ఇన్నాళ్లూ ఉగ్గబట్టి ఉన్న వైసీపీ నేతలు కొందరు.. ఇక ఇమడలేక గుడ్‌బై చెప్పేస్తున్నారు. దీనికంతటికీ ఎమ్మెల్యే రాపాక వైఖరే కారణమని రాజోలు వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.రాపాక కండువా మార్చేయడంతో.. కొందరు జనసేన స్థానిక నాయకులు ఆయన్ని అనుసరించారు. కానీ.. మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారికి ప్రాధాన్యం దక్కక అసంతృప్తి రాజుకుంది. అది అనేక రకాలుగా బయట పడినా.. తాత్కాలిక సర్దుబాటు చేశారు కానీ.. సమస్యను పరిష్కరించలేదు పార్టీ పెద్దలు. దీంతో వేచి చూసిన అసంతృప్తి నాయకులు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. రాజోలుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు అదే చేశారు. రాపాక నాయకత్వాన్ని మొదటి నుంచి అంగీకరించని రామరాజు.. పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవాలని గతంలో డిమాండ్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయనే వైసీపీ నుంచి వెళ్లిపోయారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాగి రామరాజు.. నియోజకవర్గ బూత్ కమిటీ ఇంఛార్జ్ సుందరపు బుల్లబ్బాయి సైతం పార్టీకి రాజీనామా చేసేశారు.రాజోలు వైసీపీ మూడు ముక్కలాటగా మారిందనే విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. ఎమ్మెల్యే రాపాకను పార్టీ ఇంఛార్జ్‌గా ప్రకటించాక ఆ వర్గపోరు మరింత ఎక్కువైందట. తన వర్గానికే రాపాక ప్రాధాన్యం ఇవ్వడం.. వైసీపీలోని మిగతా నేతలకు అస్సలు రుచించలేదని సమాచారం. ఎమ్మెల్యే వైఖరి నచ్చని మరికొందరు నాయకులు సైతం రాజీనామా ఆలోచనలో ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో రాజోలు వైసీపీ కోఆర్డినేటర్లుగా పనిచేసిన బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీలు మొదటి నుంచి రాపాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఎవరి వర్గం వారిదే. బొంతకు, అమ్మాజీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా కలిసి పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు జారిపోతుండటంతో కేడర్ కలవర పడుతోంది.రాజోలులో జరుగుతున్న పరిణామాలను వైసీపీ పెద్దలు గమనిస్తున్నట్టు చెబుతున్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటారని కేడర్ భావిస్తోంది. అయితే సమస్య మరింత జఠిలం కాకుండా ఎప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడతారన్నదే ప్రశ్న. వైసీపీ శ్రేణులు మాత్రం తాడేపల్లి నుంచి ఆదేశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.