విజయవాడ, జూన్ 27,
విద్యా రంగంలో వైయస్.జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి.2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా కొనసాగుతుందనేందుకు ఇదొక ఉదాహరణ. వీరంతా కూడా ఒకటోతరగతిలో చేరిన పిల్లల తల్లులు. 75శాతం హాజరు నిబంధనను వీరు సంతృప్తికరంగా పూర్తిచేయడం మంచి పరిణామం. మొత్తంగా 43,96,402 మంది తల్లులకు సుమారు రూ.6,595 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్‌నొక్కి జమచేయనున్నారు. తద్వారా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 67.35శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత 59.96శాతం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, గత జనాభా లెక్కల నాటికి ఆ 55 ఏళ్ల సంవత్సరాల్లో కూడా నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించలేకపోయాం. ప్రగతికి ఇదో పెద్దలోటు. 2019లో వచ్చిన దృఢసంకల్పంతో కూడిన రాజకీయ నాయకత్వం ఈ పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకుంది. పుట్టిన ప్రతి పిల్లాడు కూడా బడికిపోవాలన్న సదుద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభమైంది. పిల్లల చదువులకోసం ఏ పేదింటి తల్లీ భయపడవద్దని, కేవలం బడికి పంపితే చాలు రూ.15వేల ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుచ తప్పక అమలు చేస్తోంది వైయస్.జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో కేవలం బడికి వెళ్లే పిల్లలకు మాత్రమేనంటూ ఈ పథకాన్ని పేర్కొన్నా తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ చదువుతున్న వారికీ వర్తింప చేశారు. 2019–2020 విద్యాసంవత్సరంలో 42,33,098 మంది తల్లులకు రూ. 6,349.53 కోట్ల రూపాయలను చిత్తూరులో 2020, జనవరి 9న ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమచేశారు.2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను నెల్లూరులో 2021,జనవరి 11న సీఎం బటన్‌నొక్కి జమచేశారు. మొదటి ఏడాదిలో పథకం అప్పుడే ప్రారంభం అయిన దృష్ట్యా వారి పిల్లలను బడికి పంపేలా తల్లులను ఉత్సాహపరిచేలా ఎలాంటి హాజరు శాతాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ కూడా అమ్మ ఒడిని జమచేసింది. రెండో ఏడాది కూడా కోవిడ్ కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు అందరికీ కూడా పిల్లల హాజరుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వర్తింపచేసింది. ఈ ఏడాదిమాత్రం 75శాతం హాజరును పరిగణలోకి తీసుకుంది. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపు చేస్తామని నేరుగా ముఖ్యమంత్రే చిత్తూరు ‘అమ్మ ఒడి’ సభలో స్పష్టంచేశారు. మొత్తంగా మూడేళ్లకాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.పిల్లలను బడికి పంపేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య దాదాపు రూ.7 లక్షలు పెరిగింది. 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు పెరిగి, 72.7 లక్షలకు చేరుకుంది. మరోవైపు కోవిడ్ లాంటి విపత్తు సమయంలో పిల్లల చదువులకు అందిస్తున్న డబ్బు వారికి ఎంతగానో మేలు చేసింది. విపత్తు సమయంలో ఈ పథకాలు ఒక రక్షణ కవచంలా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.పిల్లలకు విద్యాకానుక ద్వారా ప్రతిఏటా వైయస్.జగన్ సర్కార్ మరికొన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. 3 జతల యూనిఫారంతోపాటు షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, ఇంగ్లిషు నిఘంటువు అందిస్తోంది. విద్యాకానుక కోసం 2020–21లో రూ. 648.11 కోట్లు ఖర్చుచేస్తే, 2021–22లో రూ.789.21 కోట్లు ఖర్చుచేసింది. మొత్తంగా రెండేళ్లలో రూ.1,437.32 కోట్లు ఖర్చుచేసింది. ఈఏడాది కూడా భారీఖర్చుకు సిద్ధమైంది. మొత్తంగా మూడేళ్లలో రూ.2,324 కోట్లు ఖర్చుచేసింది.