విశ్వాస పరీక్షకు ముందే కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు ప్రజాస్వామ్య గెలిచిందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తాజా పరిణామం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఒక గుణపాఠ మన్నారు. కర్ణాటక విధాసన సభలో ఏం జరిగిందో అంతా చూశారని, స్పీకర్, భాజపా ఎమ్మెల్యేలు జాతీయగీతం ఆలపించకుండానే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారని అన్నారు. ఆరెస్సెస్, మోదీ, అమిత్ షా ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఐక్యంగా నిలబడిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహించారని మండిపడ్డారు. నిత్యం అవినీతి గురించి మాట్లాడే మోదీ.. కర్ణాటకలో అవినీతిని ప్రోత్సహించారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని భాజపా భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలతో ఫోన్‌లో జరిపిన బేరసారాలు సైతం బహిర్గతమయ్యాయని రాహుల్ అన్నారు. విపక్షాలన్నీ కలిసి భాజపా ఆగడాలను అడ్డుకొని ఓడించాయన్నారు. దేశ ప్రజలు, వ్యవస్థల కంటే ప్రధాని గొప్పవాడు కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలను పాలించేందుకు మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ, ఆ పార్టీ కార్యకర్తలతో పాటు కర్ణాటక ప్రజలకు రాహుల్‌గాంధీ అభినందనలు తెలిపారు.
గోవా, మణిపూర్‌లోనూ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఎరచూపారని కర్ణాటకలో ఈ ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇందుకు కర్ణాటక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, దేవెగౌడ, ఆ పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎలాగానా బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ ఎన్నో ప్రలోభాలకు పాల్పడినట్టు ఫోన్ సంభాషణలు, టేపులు చెబుతున్నాయని దీనినిబట్టే దేశంలో అవినీతిని నిర్మూలిస్తామని మోదీ చెప్పే మాటలు పచ్చి అబద్దాలని మరోసారి రుజువైందని రాహుల్ అన్నారు. కర్ణాటకలో తాజా పరిణామం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఒక గుణపాఠం అని ప్రజల అభీష్టం కూడా తాజా ఫలితంతో రుజువైదంని పేర్కొన్నారు.