YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ షెడ్యూల్ ఇలా

మోడీ షెడ్యూల్ ఇలా

హైదరాబాద్, జూన్ 27,
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు అధికారులు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ జులై 2వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జులై 2, 3వ తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఈ రెండు రోజులు రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. తిరిగి 4వ తేదీన ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరుతారు. ప్రధాని మోదీతో పాటు.. బీజేపీ అగ్రనాయకత్వం అంతా హైదరాబాద్‌ రానుంది. జులై 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుంటారు. ఆయనకు శంషాబాద్ విమనాశ్రయ వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌లో కిలోమీటర్ దూరం రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో జేపీ నడ్డా పాల్గొంటారు. ఇక అమిత్ షా, ఇతర ముఖ్య నేతలందరూ హైదరాబాద్‌కు రానున్నారు. వీరంతా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీ గల్లీ వరకు బీజేపీ అగ్రనాయకులందరూ క్యూ కడుతున్నారు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే.. హైదరాబాద్‌లో జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలను బీజేపీ నిర్వహిస్తోంది. అలాగే హైదరాబాద్ శివార్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ వేసింది. ఈ సభకు పది లక్షల మంది జనాలను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో పాగా వేయటమే లక్ష్యంగా తాము మున్ముందుకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Related Posts