టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగస్టార్ చిరంజీవి 1998 అక్టోబర్ 2న స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ కింద ‘చిరంజీవి నేత్ర మరియు రక్తనిధి’ సంస్థ గత కొన్నేళ్లుగా ప్రజా సేవకు పునీతం అయిన విషయం తెలిసిందే. రక్తం, నేత్రాలిచ్చి ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన ఈ బ్లడ్ బ్యాంక్‌లో భారీ గోల్ మాల్ జరిగింది. ఈ భారీ గోల్‌మాల్‌తో బ్లడ్ బ్యాంక్ వార్తల్లోకెక్కింది.
అసలేం జరిగింది..
బ్లడ్ బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన చిల్లరపనికి మొత్తం యాజమాన్యానికి చెడ్డపేరు వచ్చింది. చిరు బ్లడ్ బ్యాంక్‌లో రక్తం దానం చేసిన తర్వాత దాతలకు ఇచ్చే జ్యూస్, పండ్ల వ్యవహారంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గరున్న ఈ బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్నఉద్యోగి నాలుగేళ్లుగా పండ్లు, జ్యూస్ విషయంలో బిల్లులు అధికంగా వేసి సంస్థ నుంచి డబ్బు లాగుతున్నాడు. అసలేం జరుగుతోంది? ఇంత డబ్బులు ఎందుకు అధికంగా చెల్లించాల్సి వస్తోంది? అని ఆరాతీసిన నిర్వాహకుడికి నివ్వెరపోయే నిజం తెలిసింది.
ఇక్కడ పనిచేసే ఉద్యోగే ఈ తతంతం అంతా నడుపుతున్నాడని తెలుసుకున్న నిర్వాహకుడు స్వామి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉద్యోగి పేరు తదితర వివరాలు పోలీసులు గానీ, నిర్వాహకుడుగానీ వెల్లడించలేదు. అయితే ఇంత వరకూ ఎంత మొత్తంలో నగదు అధికంగా చెల్లించారన్నది తెలియరాలేదు. త్వరలోనే ఈ వ్యవహారంపై నిర్వాహకుడు మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.
ఆరా తీసిన చిరు?
కొన్నేళ్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా సజావుగా సాగుతున్న బ్లడ్ బ్యాంక్‌లో భారీ గోల్‌మాల్ జరగడంతో చిరంజీవి సైతం ఆశ్చర్యపోయారట. అసలేం జరిగింది? ఉద్యోగి ఇలా చేయడానికి గల కారణాలేంటి అని నిర్వాహకుడ్ని అడిగి చిరు వివరాలు తెలుసుకున్నాడట. అయితే చిరు సలహా మేరకే నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చిరంజీవి సూచించారట.