యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. యడ్యూరప్ప రాజీనామాతో అందరూ ఉన్నారాఅని ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించిన వారు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.కర్ణాటకలో రాజకీయ పరిస్థితి దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అప్రజాస్వామిక విధానాలను కర్ణాటకలో అవలంబించారని ఆయన వ్యాఖ్యానించారు. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటు కోసం భాజపా కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. కర్ణాటకలో సంప్రదాయానికి విరుద్ధంగా పనులు జరిగాయన్నారు. కర్ణాటకను భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం ఏమిటని అన్నారు. ప్రతిపక్ష నేత కర్ణాటకలో జరుగుతోన్న దారుణాలను ప్రశ్నిచలేరా అని వ్యాఖ్యానించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీలు వృద్ధి చెందుతోన్న రాష్ట్రాలని, వీటిని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గవర్నర్ వ్యవస్థలు దారుణంగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోను, తమిళనాడులోను గవర్నర్ వ్యవస్థలు విఫలం అయ్యాయన్నారు. ఓ ఎమ్మెల్యేతో బేర సారాలు చేసేందుకు గాలి జనార్దన్‌రెడ్డి ప్రయత్నాలు చేయడం.. అవసరమైతే అమిత్ షా, ప్రధానితోనూ మాట్లాడిస్తామని అనటం ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుందో ఆలోచించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.