శ్రీకాకుళం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి చేదు అనుభవం ఎదురైంది. హెలీప్యాడ్ వరకు ఆమెను పోలీసులు అనుమతించలేదు. దాంతో అలకబూనిన ఆమె.. సీఎం సభలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇటీవలి వరకు కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి తోపాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జగన్ హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ వద్దకు వెళ్లి జగన్ను స్వాగతించేందుకు కిల్లి కృపారాణి ముందుకొచ్చారు. అయితే, సీఎంకు స్వాగతం పలికే వారి జాబితాలో కృపారాణి పేరు లేకపోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ అనుమతించకపోవడంతో ఆమె అలకబూనారు. సీఎం పర్యటన సందర్భంగా అవమానించారని ఆమె వెళ్లిపోతుండగా ధర్మాన కృష్ణదాస్ అనుచరులు బుజ్జగించారు. అధికారులు పని ఒత్తిడిలో మరిచిపోయి ఉంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను ఏవరో కలెక్టర్, పోలీసు అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానం చాలంటూ కంటతడిపెట్టారు. అయినా ఆమె వినిపించుకోలేదు. సీఎం కార్యక్రమం జరిగే చోట నుంచి వెళ్లిపోయారు.