అనంతపురం, జూన్ 28,
నైరుతి రుతుపవనాలతో వర్షాలు ప్రారంభమయ్యాయి. వేసవి కాలం వెళ్లి వానలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించనున్నాయి. వైరల్ ఫీవర్స్‌తో పాటు మలేరియా, డెంగీ, స్వైన్ ఫ్లూ, పైలేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్, టైఫాయిడ్ వంటి వాటికి గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జ్వరాల బాధితులు పెరుగుతున్నారు. వీరితో పాటు శ్వాస కోశ సంబంధ వ్యాధులు, గొంతు సంబంధ వ్యాధుల బారిన జనం పడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 పిహెచ్‌సీలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని వైద్య విభాగాల్లో ఇప్పటికే ప్రజలను చైతన్య పర్చే కార్యక్రమాలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంతో పాటు కరపత్రాల ద్వారా కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రచారం చేపడుతోంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం పాటించడంలోనూ, పరిశుభ్రమైన, కాచి వడబోసిన తాగునీటిని తాగడం, ఎక్కడా నీటిని నిల్వ ఉంచకుండా చూడటం, ఇళ్లలో కూడా అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం, తొట్లలో, రిఫ్రిజిరేటర్లు వంటి వాటిలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్ట వచ్చని వైద్యాధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ప్రజల్లో రోగాలు, వాటి వ్యాప్తి గురించి చైతన్యపరుస్తున్నామని, ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధులు నియంత్రణ సాధ్యమని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఇళ్ల మధ్య చెత్తాచెదారాలు నిల్వ ఉంచడం, పశువుల పాకలు శుభ్రంగా ఉంచుకోక పోవడం, ఎరువు దిబ్బలు ఇళ్ల సమీపంలోనే వేసుకోవడం వంటి కారణాలతో దోమలు అధికంగా ఉత్పత్తయ్యే ప్రమాదని చెబుతున్నారు. జనం ముందస్తుజాగ్రత్తలు తీసుకుంటే రోగాల వ్యాప్తిని ముందస్తుగా అరికట్టవచ్చంటున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, ఎ ఎన్ ఎంలు, పంచాయతీ సెక్రటరీల ద్వారా సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్‌సిల్లోనూ వైద్య సిబ్బందితో సమావేశాలు నిర్వహించారు. కాగా విశాఖపట్నం మన్యం ప్రాంతం, రంపచోడవరం ఏరియాలో ఆంత్రాక్స్ బారిన పడి వరుస మరణాలు సంభవించిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. హిందూపురం జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో వైద్యం చేశారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి లక్షణాలు కనిపించాయంటే తక్షణం ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు, సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టామన్నారు. 5వేల జనాభా ఉన్న ఒక్కో హెల్త్ సబ్ సెంటర్‌కు రూ.10వేలు ఎఎన్‌ఎం ద్వారా నిధులు అందిస్తున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నిధుల్ని వారే వెచ్చించాల్సి ఉందన్నారు