విజయవాడ, జూన్ 28,
రాష్ట్రంలో అమ్మ ఒడి పథకానికి 51 వేల మందిని దూరం చేసేశారు. పైగా ఇందులో నా తప్పేమీ లేదు... మీ పిల్లల హాజరు 75శాతం లేదు.. అది మీ తప్పేనంటూ నెపం తల్లుల మీదకు నెట్టేశారు. ఒక విధంగా 51 వేల మంది అమ్మలను అమ్మఒడి పథకానికి దూరం చేయడం ద్వారా జగన్ తనకు చాతకాదని బహిరంగంగా ఓప్పుకున్న సందర్భమింది. రాష్ట్రంలో 51 వేల మంది అమ్మలకు అమ్మఒడి ఇవ్వడం లేదని జగన్ బహిరంగంగా అంగీకరించారు. అయితే వారు అమ్మ ఒడికి దూరం కావడానికి మాత్రం తను కారణం కాదని అంటున్నారు. విద్యార్థుల హాజరు శాతం 75 లేకపోవడం వల్లే ఆ తల్లులందరికీ అమ్మ ఒడి ఇవ్వలేదని సాకు చెబుతున్నారు.ఇది ఎంత వరకూ సమంజసమనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. రాష్ట్రంలో ఈ సారి 51 వేల అమ్మలకు అమ్మ ఒడి ఎగ్గొట్టినట్టు ఏ మాత్రం సంకోచం లేకుండా జగన్ చెప్పడాన్ని పలువురు గర్హిస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా సీఎం జగన్ స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో అమ్మ ఒడి పథకం మూడో విడత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 శాతం హాజరు ఉండాలని అమ్మ ఒడి జీవోలోనే పొందుపర్చామని చెప్పారు. ఆ జీఓ ప్రకారం 51 వేల మంది తల్లుల పిల్లల హాజరు శాతం నిర్దేశించిన దాని కంటే తగ్గిందని, అందుకే వారికి అమ్మ ఒడి అందించ లేదని చెప్పుకొచ్చారు. పైగా భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తెలత్తకూడదంటే తల్లులు తమ పిల్లల్ని బడికి పంపాలంటూ సలహా పారేశారు. జగన్ చెప్పిన ప్రకారమే చూసుకుంటే.. అంత మంది విద్యార్థులకు హాజరు శాతం ఎందుకు తగ్గింది? వారంతా ఎందుకు పాఠశాలలకు హాజరు కాలేదు? అనే విషయాన్ని సమీక్షించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి లేదా? అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక పక్కన కరోనా వచ్చి విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఆన్ లైన్ తరగతుల పేరుతో ఎందరో విద్యార్థులు ఇళ్ల నుంచే క్లాసులకు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరం పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. బయటికి వెళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గిన మాట వాస్తవమే కావచ్చు. దొరికిందే సందు అనే విధంగా ఎప్పుడు ఏ వంక దొరికితే.. హామీల లబ్ధిదారుల సంఖ్యను కుదించేద్దామా అన్న రీతిలో జగన్ సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు శాతం నెపంతో వేలాది మంది తల్లులను అమ్మ ఒడి పథకాకి జగన్ సర్కార్ దూరం చేసిందని పలువురు విమర్శిస్తున్నారు.పథకాలను ఎగ్గొట్టే దురాలోచన చేస్తూనే.. అమ్మ ఒడి పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అమ్మ ఒడి పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించడాన్ని తప్పుపడుతున్నారు. స్కూలుకు తమ పిల్లల్ని పంపించే తల్లులకు అమ్మ ఒడి అందిస్తామని హామీ ఇచ్చింది జగన్ అయితే.. విమర్శకులు డబ్బులు ఇచ్చారా? అని అనడంమేమిటని అంటున్నారు. తన హామీలకు కోతలు పెట్టేందుకు, ఎగ్గొట్టేందుకు దారులు తానే వెదికిన జగన్ రెడ్డి ఇప్పడు ‘అంతా మీరే చేశారు’అన్న రీతిలో విద్యార్థులు, వారి తల్లులపైనే నెపం నెట్టేయడం దారుణం అంటున్నారు. అంత మంది తల్లులకు అమ్మ ఒడి ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తనకు ప్రజల అండ ఉన్నంత వరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరం’టూ మరోసారి తన అక్కసును, అసహనాన్ని బహిరంగంగా వెళ్లగక్కడం విస్మయానికి గురిచేస్తోందంటున్నారు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తల్లికి కూడు పెట్టనోడు.. పినతల్లికి గాజులు చేయించాడు’ అన్న చందంగా పేద విద్యార్థుల కోసం బైజూస్ యాప్ తీసుకొచ్చామంటున్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తారట. ఉన్నది పీకేసి లేనిది ఇవ్వడం అంటే ఇదేనేమో అంటున్నారు.