తిరుపతి, జూన్ 28,
అది 2015 నవంబర్. చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లను మున్సిపల్ కార్యాయలంలోనే ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం. కటారి దంపతుల దగ్గరి బంధువైన చింటూనే కీలక సూత్రధారిగా అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. కోర్టు విచారణలో ఉన్న కేసును ఈ నెల 30కి వాయిదా వేశారు. విచారణలో భాగంగా సాక్ష్యులకు సమన్లు వెళ్లాయి. ఇదే కేసులో వైసీపీ నేత బుల్లెట్ సురేష్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ నెలాఖరున కోర్టులో ట్రయిల్ మొదలవుతుందనే కారణమో.. లేక పొలిటికల్‌గా పైచెయ్యి సాధించాలనే ఆత్రుతో ఏమో.. ఒక్కసారిగా చిత్తూరు రాజకీయం సెగలు కక్కుతోంది.ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ సాక్ష్యులను బెదిరిస్తున్నారనేది కఠారి దంపతుల కోడలు.. మాజీ మేయర్ హేమలత ఆరోపణ. ఇందులో కొందరు వైసీపీ నేతల పేర్లను ప్రస్తావించారామె. ఇంతలో కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సతీష్‌ను గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం.. అతను దొరక్కపోవడంతో.. కటారి కుటుంబానికి ముఖ్య అనుచరుడిగా ఉన్న పూర్ణను స్టేషన్‌కు తీసుకెళ్లడం రచ్చ రచ్చ అయింది. హేమలతతోపాటు టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి మారిపోయింది. ఈక్రమంలో పోలీస్ జీపు ధర్నా చేస్తున్న హేమలత కాలి పైనుంచి వెళ్లడంతో ఆమెకు గాయమైంది. గంజాయిని పోలీసులే తీసుకొచ్చి.. తప్పుడు కేసులు పెడుతున్నారనేది టీడీపీ నేతల ఆరోపణ.పోలీసుల తీరును నిరసిస్తూ.. టీడీపీ నేతలు అమర్నాథరెడ్డి తదితరులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దాంతో ఈ ఆందోళనలో పాల్గొన్న అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబుతోపాటు మిగతా వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిగా ఉన్న వైసీపీ నేత బుల్లెట్ సురేష్ ఒత్తిళ్ల మేరకే పోలీసులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని జిల్లా పోలీసులు కొట్టి పారేసినా.. కటారి దంపతుల హత్య కేసు కోర్టులో విచారణకు వస్తున్న సమయంలో మారుతున్న పరిణామాలు ఉద్రికత్తలకు దారితీస్తున్నాయి. రెండు వర్గాలు పట్టుబిగించడంతో సమస్య శ్రుతిమించుతోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. మరి.. రానున్న రోజుల్లో ఈ హత్య కేసు విచారణ చుట్టూ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.