YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ను సంక్షేమం కాపాడుతుందా

జగన్ ను సంక్షేమం కాపాడుతుందా

విజయవాడ జూన్  29,
తొమ్మిదేళ్లు కష్టపడితే జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు. అన్నీ కలసి రావడం ఆయనను ముఖ్యమంత్రి పదవికి మరింత చేరువ చేసింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ తీరులో స్పష్టమైన మార్పు కన్పిస్తుంది. వాస్తవాలకు దూరంగా ఉంటున్నారు. అధికారుల నివేదికలపై ఆధారపడుతున్నారు. ఒకరిద్దరు పార్టీ నేతలనే జగన్ నమ్ముకున్నారు. ఆల్ ఈజ్ వెల్ అన్న నమ్మకంతో జగన్ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు జగన్ వద్దకు చేరడం లేదు. ఇటు జనానికి, అటు లీడర్లకు, మరో వైపు క్యాడర్ కు దూరంగానే ఉంటున్నారు... విపక్ష పార్టీలకు చెందిన మీడియా బయటపెడుతున్నా వాటిని అసలు లెక్క చేయడం లేదు. టీడీపీ అనుకూల మీడియా జగన్ సర్కార్ పై ఎక్కువగా విమర్శలు చేస్తుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అదే సమయంలో ఆ మీడియా అందించే కథనాలను అంత పూర్తిగా కొట్టిపారేయలేం. కొంత నిజముంది. 40 శాతం నిజంతో ఆ మీడియా కొంత అతి చేస్తున్నా జగన్ మాత్రం దానిని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. అందులో ఉన్న కొద్దిపాటి వాస్తవాన్ని కూడా జగన్ అంగీకరించడం లేదు.. ఇది 2019 ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పాలి. అప్పుడు కూడా చంద్రబాబుకు అధికారులు బాకా ఊదారు. తప్పుడు నివేదికలు ఇచ్చారు. బాబు నమ్మే ఒకరిద్దరు నేతలు కూడా పోలవరం, అమరావతి మళ్లీ సీఎంగా చేస్తుందని చంద్రబాబును నమ్మించారు. ఇప్పుడు కూడా వైసీపీలో అదే జరుగుతుంది. పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయని, మూడున్నర కోట్ల సాలిడ్ ఓటు బ్యాంకు ఉందని జగన్ ను కొందరు నేతలు నమ్మిస్తున్నారు.  కానీ ఆరోజు చంద్రబాబును పోలవరం, అమరావతి కాపాడలేదు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ ను సంక్షేమ పథకాలు, నగదు బదిలీయే రక్షిస్తాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేత ఉందని భావిస్తున్నారు జగన్. కానీ అంతకు మించి ప్రభుత్వం పై ఉందని తెలుసుకోలేకపోతున్నారని పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లలో అభివృద్ధిని పక్కనపెట్టి పూర్తిగా తాడేపల్లి కార్యాలయంలో కూర్చున్న జగన్ ను పని చేయని సీఎంగా జనం భావిస్తున్నారు. చంద్రబాబుతో పోల్చుకుని ఆయన పనితీరును బేరీజు వేసుకుంటున్నారు. సీఎం కాక ముందు జనాలకు ఎంత దగ్గరగా ఉన్నారో, అయినా తర్వాత అంత దూరమయ్యారని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మొత్తం మీద జగన్ జాగ్రత్త పడకపోతే ఒక్క ఛాన్స్ అన్న ఆయన మాట నిజం కాక తప్పదు.

Related Posts