విజయవాడ, జూన్ 29,
రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్‌సైడ్. ఇక ఉపఎన్నికల్లో అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. లక్ష మెజారిటీతో గెలుపొందడం ఖాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా క్లీన్ స్వీప్ చేసేస్తాం. 175 నియోజకవర్గాల్లో విజయ పతాకం ఎగరవేస్తాం'. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న ధీమా. 2019 ఎన్నికల అనంతరం జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే వైసీపీకి అంత అనుకూలంగా లేవని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించింది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించగా, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిని బరిలోకి దించలేదు. మెజారిటీపై పదే పదే శపథాలు చేసినా ఎక్కడా వైసీపీ అందిపుచ్చుకోలేదు. ఈ ఎన్నికల్లో గెలుపునే అస్త్రంగా చేసుకుని మూడేళ్ల పాలనకు రెఫరెండం అనుకుంటే వైసీపీ బొక్కబోర్లా పడినట్లేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ ఫలితాలు లోలోపల మాత్రం మదనపెట్టిస్తున్నాయని తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 60 శాతం మంది ప్రజాప్రతినిధులు ఓటమి పాలయ్యే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల సర్వేలో తేటతెల్లమైనప్పటికీ ఆ పార్టీ మాత్రం తమకు ఎదురేలేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. వైసీపీ నాయకత్వం మేల్కొనకపోతే 2024 ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదని తెలుస్తున్నది.రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది. సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వేవ్ నడిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై ప్రత్యేకంగా ట్వీట్ చేసి తన ఆనందాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లోనూ గెలుపొందడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు, బెదిరింపులు, కుట్రలను వ్యతిరేకిస్తూ, ఈసీ తీరును తప్పుబడుతూ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి తప్పుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షమైన టీడీపీ బరిలో లేనప్పుడు వైసీపీ గెలుపు ఏంటనేది అందరికీ తెలిసిందే. టీడీపీ పోటీ చేయని పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఎవరిపై గెలిచినట్టు? అసలు పోటీయే లేనిచోట గెలుపు ఎలా ఉంటుంది? టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తే అది ఓటమి అవుతుందా.. భారీ విజయం అవుతుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది.మరోవైపు తిరుపతి లోక్‌సభ, బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఊహించినంత మెజారిటీ అయితే సాధించడంలో వైఫల్యం చెందింది. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బరిలోకి దించడంతో మెజారిటీ తగ్గింది అని వైసీపీ కప్పిపుచ్చుకుంటుంది. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయనే ప్రచారం ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు అనేక బస్సులలో తరలివచ్చి ఓట్లు వేశారు. వారిని వివరాలు అడిగినప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యక్షంగా ప్రజలంతా తిలకించిన సంగతి తెలిసిందే. బద్వేలు ఎన్నికల్లోనూ బయట వ్యక్తులు కనిపించడం కలకలం రేపింది. ఆ ఎన్నికల్లోనూ వైసీపీ ఊహించినంత మెజారిటీ రాలేదు. దీంతో తిరుపతి లోక్‌సభ, బద్వేలులో వైసీపీ గెలుపు దొంగ ఓట్ల వల్లే సాధ్యమైందని టీడీపీ, బీజేపీలు తీవ్రంగా విమర్శించడం తెలిసిందే. బద్వేలులోనూ టీడీపీ అభ్యర్థి బరిలో లేకపోయినప్పటికీ మెజారిటీ లక్ష దాటలేదు. ఇదంతా వైసీపీపై వ్యతిరేకతేనని విమర్శలున్నాయి. అన్ని ఉపఎన్నికల్లోనూ వైసీపీ డబ్బులు సైతం పంపిణీ చేసిందని విపక్షాలు ఆరోపిస్తుండడం విధితమే.మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని వైసీపీ బరిలో దించింది. తాజా ఉప ఎన్నికలో ఆయన 82, 888 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ లక్ష మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. అనుకున్న మెజారిటీ సాధించలేకపోయింది. ఈ ఎన్నిక కేవలం సానుభూతి కోణంలోనే జరిగిందని అంటున్నారు. వాస్తవానికి ఆత్మకూరు మేకపాటి కుటుంబానికి కొట్టిన పిండి. సొంత నియోజకవర్గం. మరోవైపు యువకుడైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అందర్నీ కలచివేసింది. ఇవి రెండే వైసీపీ గెలుపునకు ప్రధాన కారణంగా మారింది. ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా చూసుకుంటే మేకపాటి కుటుంబం ఇమేజ్, సానుభూతి బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 19,332 ఓట్లు రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇన్ని ఓట్లు వచ్చిన్నప్పటికీ డిపాజిట్ రాలేదని వైసీపీ ఎగతాళి చేస్తున్నది. ఈ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని తెలుస్తున్నది.రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. ధరల పెరుగుదల, పన్నుల బాదుడు, పథకాల్లో కోత, మహిళలపై దాడులు, లైంగికదాడులు, టీడీపీ నేతల హత్య ఇలా అనేక అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయనే ప్రచారం జరుగుతున్నది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలు వారి కార్యకర్త దృష్టిలోకి తీసుకు వెళ్లింది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. అమ్మఒడి లాంటి పథకాలకు కోతలు, ఒంటరి మహిళల పెన్షన్ కు వయోపరిమితిని పెంచడం ఇవన్నీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి కారణమయ్యాయి. ఉపఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో వైసీపీకి కలిసివస్తున్నది. అంతేతప్ప టీడీపీ బరిలో ఉంటే వైసీపీ సత్తా ఏంటో తేలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 2019 తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపొందినప్పటికీ.. ఆ ఫలితాలు 2024 ఎన్నికలను ప్రభావితం చేయలేవని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతున్నది. ఈ వ్యతిరేకతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారని తెలుస్తున్నది. అందువల్లే రెండున్నరేళ్ల ముందే ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌ను సీఎం జగన్ రంగంలోకి దించారని సమాచారం.