న్యూఢిల్లీ జూన్ 29,
అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం… యాత్రా చరిత్రలోనే తొలిసారిగాభారీ ఎత్తున స్నిఫర్ డాగ్ లను వాడుతున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఏటా 43 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్ర.. ఈ జూన్ 30న మొదలవుతుంది. యాత్రలో భాగంగా మొదటి బ్యాచ్ 29న తెల్లవారు జామున జమ్మూలోని బేస్ క్యాంప్ భగవతి నగర్ నుంచి బయలుదేరింది. సాంప్రదాయ బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో 30న అధికారికంగా మొదటి బ్యాచ్‌లో చేరనుంది. హోలీ అమర్నాథ్ యాత్ర నిర్విగ్నంగా సాగే దిశగా.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది అధికార యాంత్రాంగం. గ్రనైడ్స్, స్టికీ బాంబ్స్ వంటి పేలుడు పదార్ధాలు వాడి యాత్రను ఆటంక పరిచే టెర్రరిస్టు అటాక్ లను పసిగట్టేందుకు 130 జాగిలాలను వాడుతున్నారు. వీటిని జర్మన్ షెపర్డ్, బెల్జియమ్ మెలినియోస్, లాబ్రడార్ వంటి జాతుల నుంచి ఎంపిక చేశారు.కోవిడ్ కారణంగా 2020, 21 సంవత్సరాల్లో యాత్ర రద్దు కావడం, ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రభావం ఇంకా ఉండటం.. వంటి కారణాలతో.. యాత్రపై కొన్ని ఉగ్రమూకల కన్ను పడినట్టు గుర్తించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు.. అమర్నాథ్ యాత్రకు భంగం వాటిల్లేలా కొన్ని.. పాకిస్థానీ టెర్రరిస్టు మూకలు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరిప్పటికే ఈ దిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.అందుకే అమర్నాథ్ యాత్రకు బలగాలను రెట్టింపు చేయడంతో పాటు.. ఈ జాగిలాలను సైతం మొహరించారు. వీటితో పాటు ఇజ్రాయిలీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎల్ఈడీ డిటెక్టర్స్, బైనాక్యులర్లను సైతం వాడుతున్నారు. ఈ భారీ భద్రతా ఏర్పాట్లలో సైన్యంతో పాటు, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇతర అధికారులతో పాటు, అమర్నాథ్ బోర్డు మెంబర్లు సైతం పాల్గొంటున్నారు.