ఏలూరు, జూలై 5,
బీజేపీ. జనసేనల మధ్య దూరం పెరిగిందా? ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు, ఆయన పాల్గొనే భారీ బహిరంగ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ కు అందుకే ఆహ్వానం అందలేదా? అన్న ప్రశ్నలకు రాజకీయ పండితులు ఔననే సమాధానం ఇస్తున్నారు.ఇప్పటి కిప్పుడు ఆ రెండు పార్టీలూ కూడా తమ మధ్య మైత్రి చెడిందని బహిరంగంగా ప్రకటించకపోయినా.. జనసేన, బీజేపీల మధ్య సంబంధాలు బెడిసాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నా..జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఛాయలకు కూడా వెళ్లకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా వారు చూపుతున్నారు. తాను భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లలేకపోవడానికి బిజీ షెడ్యూల్ కారణమని పవన్ కల్యాణ్ చెబుతున్నా.. ఇరు పార్టీల మధ్యా సఖ్యత ఉండి ఉంటే షెడ్యూల్ మార్చుకునైనా పవన్ కల్యాణ్ హాజరై ఉండేవారని వారు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ హాజరౌతారనీ, మోడీతో వేదిక పంచుకుంటారనీ మొదటి నుంచీ జనసేన వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ, జనసేనల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యత చెడింది.ఆ తరువాతే పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు. పొత్తుల సంగతి ఎత్తకుండా తన పని తాను సుకుపోతున్నారు. మళ్లీ గతంలోలా ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదనే పల్లవి అందుకున్నారు. ఇక మోడీతో వేదిక పంచుకోలేకపోవడానికి కారణాలు చెబుతన్నా.. ఆజాదీ కా అమృతోత్సవల్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ గొప్ప కార్యక్రమం అంటూ వీడియో విడుదల చేసినా.. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం కచ్చితంగా బీజేపీ జనసేనల మధ్య చెడిన సంబంధాలనే ఎత్తి చూపుతున్నాయని సామాన్య ప్రజలు సైతం భావిస్తున్నారు. అయితే రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ, ఆ తరువాత జరిగే మోడీ బహిరంగ సభకూ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయడు, మంతెన శివరామరాజు మాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక షెడ్యూల్ లో వీరిరువురి పేర్లూ ఉన్నాయి. అయితే జనసేన నేతల ప్రస్తావనే లేదు. మరో వైపు ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ తో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరౌతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని ఆహ్వానించి... రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఇంకా చెప్పాలంటే.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ కు ఆహ్మానం పంపకపోవడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు. ఇక కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నా.. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టారాజ్యంగానే ఆహ్వినితుల జాబితాను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రొటోకాల్ ప్రకారం తన సొంత నియోజకవర్గానికి వస్తున్న మోడీకి ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ ప్రధాని పర్యటనకు హాజరయ్యే వారి జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఆయన పేరు జాబితాలో లేకపోవడానికి ఆయన రాక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం జగన్ కు ఇష్టం లేకపోవడమే కారణమన్నది జగద్వితితమే. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబితే అది మాత్రమే చేసిందనడానికి ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టేయడమే నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి.