ఒంగోలు, జూలై 5,
కుప్పంలో ఓడిపోయినా టీడీపీ అక్కడ గెలిచి రికార్డు సృష్టించింది. అధినేత కూడా అన్ని వేదికలపైనా ఆ గెలుపు గురించే మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా దుబాయ్ గోల వచ్చిపడింది. దీంతో జెట్ స్పీడులో దూసుకుపోతున్న పార్టీ కాస్తా ఇప్పుడు సైలెంటైంది. దీంతో తమ్ముళ్లలో ఎక్కడలేని అయోమయం ఏర్పడిందట. ఇంతకీ దర్శి టీడీపీలో దుబాయ్ గోల తీరేదెపుడు?ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడిపోయారట. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడినా ఆ తర్వాత తొలిసారిగా జరిగిన దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ఫుల్ స్వింగ్‌లోకి వెళ్లిపోయామనుకున్నారట. కానీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాదుడేబాదుడు కార్యక్రమంతో, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రం జరగటం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుండి వైసీపీ అభ్యర్ది మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన శిద్దా రాఘవరావు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఆయన ఒంగోలు లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత వైసీపీలో చేరారు.మరోపక్క గత ఎన్నికల్లో దర్శినుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కదిరి బాబురావు కూడా వైసీపీలో చేరటంతో కొంతకాలం దర్శి టీడీపీ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆ పార్టీ అధిష్టానం పమిడి రమేష్ కు పార్టీ నియోజకవర్గ భాద్యతలు అప్పగించింది. గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత సమర్ధవంతంగానే పనిచేశారనే టాక్ పార్టీలో వచ్చింది. పైగా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కూడా సాధించారు. కుప్పంలో ఆ పార్టీ ఓడినా ఇక్కడ మాత్రం ఒన్ సైడ్ విక్టరీని సాధించగలిగింది.టీడీపీ గెలుపుకు వైసీపీలో ఉన్న లుకలుకలు మరో కారణం అయినప్పటికీ అందివచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ ఇంఛార్జ్ రమేష్ వినియోగించుకోవటంలో సఫలమయ్యారనే టాక్ ఉంది. దీంతో చంద్రబాబు కూడా ప్రకాశం జిల్లా నేతలందరూ సమిష్టిగా పనిచేసి క్లిష్ట పరిస్దితుల్లో పార్టీని నిలబెట్టారని, ఏపీలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా గుర్తు చేస్తున్నారు. ఒంగోలు మహానాడులో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంత వరకూ అంతా బాగానే ఉన్నా మహానాడు తర్వాత, దర్శి నియోజకవర్గంలో గందరగోళ పరిస్దితులు ఏర్పడ్డాయట. మహానాడు కార్యక్రమ సమయంలో ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి సినీనటుడు బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలవటం, అవకాశం ఇస్తే దర్శి నుండి పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముందు చెప్పారట. ఈ విషయం దర్శి టీడీపీలో హాట్ టాపిక్ లా మారిందట..దుబాయ్ సుబ్బారావు పేరు వినిపించగానే దర్శి టీడీపీలో గందరగోళం మొదలైందట. అదే సమయంలో పార్టీ పిలుపునిచ్చిన బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా జరగకపోవటంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం ఏర్పడింది. ఇప్పటి వరకూ ఫుల్ జోష్‌లో ఉన్నామనుకుంటున్న పార్టీ శ్రేణులకు అసలేం జరుగుతుందనే అనుమానాలు మొదలయ్యాయట.ఈ అనుమానాలకు తగ్గట్టుగానే ఆ పార్టీ ఇంఛార్జ్ పమిడి రమేష్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదట. మహానాడు సమయంలో దుబాయ్ సుబ్బారావు పేరు సీన్ లోకి వచ్చిన తర్వాత రమేష్ అసంతృప్తిగా ఉంటున్నారని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. మరోపక్క టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే జనసేనకు దర్శి టికెట్ కేటాయించవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ పరిణామాల మధ్య అసలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ? పమిడి రమేష్ సైలెంట్ అవటానికి కారణాలేంటి? దుబాయ్ సుబ్బారావు దర్శి టీడీపీలో ఎంటర్ అవుతున్నారా? అధినేత మనసులో అసలేముంది..అనే ప్రశ్నలతో కేడర్ సతమతమౌతోందని టాక్.