YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆలీతో సరదాగా జగన్

ఆలీతో సరదాగా జగన్

గుంటూరు, జూలై 5,
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీస్తారో.. ఎప్పుడు ఎవరిని దూరం నెట్టేస్తారో ఎవరికీ ఎప్పటికీ అర్ధం కాదు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో అప్పటి దాకా మంత్రివర్గంలో నోరెట్టుకు విపక్షాల మీద పడిపోయి.. అధినేత మన్ననలు పొంది ఆయనకు సన్నిహితులుగా మెలిగిన వారంతా మాజీలైపోయి.. ఎక్కడా కనిపించక, వినిపించక కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే.అంతకంటే ముందు పార్టీ విపక్షంలో ఉన్న సమయం నుంచీ అంతా తానై చక్రం తిప్పిన విజయసాయి పరిస్థితీ అంతే ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా ఆయన పరిధిని పరిమితం చేసేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున విజయసాయి మాజీ మంత్రుల్లా ఎవరికీ పట్టకుండా మిగిలిపోకుండా తప్పించుకున్నారు. సరే ఇప్పుడు ఆయన పరిధిని జగన్ ఒకింత పెంచారు అది వేరే సంగతి. విషయమేమిటంటే.. జగన్ ఎవరిని ఎందుకు దగ్గరకు తీస్తారో.. ఎవరిని ఎందుకు దూరంపెట్టేస్తారో అంటే సమాధానం చెప్పేవారు వైసీపీలోనే లేరన్నది మాత్రం వాస్తవం.అసలు జగన్ కైనా అందుకు లాజికల్ కారణాలు తెలుసా అంటే అదో మిలియన్ డాలర్ల ప్రశ్నే.  తాను జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకుని మోసిన సొంత తల్లి విజయమ్మ, సోదరి షర్మిలల పరిస్ధితి ఇప్పుడు ఏమిటి?  అలాగే  2019 ఎన్నికలకు ముందు  వైసీపీలో  చేరిన ఆయన, కొద్ది కాలం పాటు ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అ ఎన్నికలలో  పార్టీ గెలుపు కోసం,చాలాచాలా కష్ట పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ, ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. పనిలో పనిగా,  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్’ గా విమర్శలు గుప్పించారు. నోరుంది ఎందుకంటే, రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించే అందుకే  అన్నట్లు విరుచుకు పడ్డారు.సరే అధికారంలోకి వచ్చిన తరువాత పృధ్వీ కష్టానికి తగిన ఫలితం అనే విధంగా  జగన్ ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. కారణాలేమైతేనేం అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.  ఆ తరువాత వైసీపీలో ఆయనను పట్టించుకున్న నాథుడే లేడు. ఇక తాజాగా అలీ పరిస్థితి కూడా కొంచం అటూ ఇటూగా ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ పరిస్థితే ఎదురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. సినిమా థియేటర్ల టికెట్ల రేట్ల తగ్గింపు అంశంపై చర్చించేందుకు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ నటులు  తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన సందర్భంగా అలీని జగన్ ప్రత్యేకంగా పిలిపించుకున్నారు.అలీతో పాటు పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు అది మరో సంగతి. వారితో భేటీ అనంతరం జగన్ అలీని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు.  త్వరలో పిలుపు వస్తుంది సిద్ధంగా ఉండమని జగన్ అలీకి చెప్పారు. దీంతో అలికి వైసీపీలో కీలక పదవి ఖాయమనీ, కనీసం రాజ్యసభ సభ్యత్వం అయినా కట్టబెడతారనీ ఓ టాక్ అటు ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయ వర్గాలలోనూ జోరుగా సాగింది. ఈ ఊహాగాన సభలకు ఊతమా అన్నట్లు  ఇది జరిగిన కొద్ది రోజులకే అలీ కుటుంబ సమేతంగా   తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు.   ఆ భేటీ తరువాత అలీ మీడియాతో తనకు ఏదో పదవి ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. జగన్ కు తనకు ఎప్పుడు ఏం ఇవ్వాలో తెలుసునని మర్మగర్భంగా చెప్పారు. అయితే ఇది జరిగి కూడా అర్ద సంవత్సరం గడిచిపోయింది. అలీకి దక్కింది ఏమీ లేదు. ఎదురు చూపులు తప్ప. ఇప్పడు పరిస్థితి ఎలా మారిందంటే సర్కార్ ఏర్పడి మూడేళ్లు పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ దృష్టి అంతా తదుపరి అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. గడువుకు ముందే ఎర్లీ ఎలక్షన్లకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అలీకి పార్టీ పదవి ఇచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమేనని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇండస్ట్రీలో తనకు ఎంతో సన్నిహితుడిగా ఉన్న పవన్ కల్యాణ్ ను కాదని మరీ అలీ వైసీపీ గూటికి చేరారు. ఆ తరువాత ఆ విషయంలో పవన్ ఒకింత బాధను వ్యక్తం చేశారు కూడా. మన వాళ్లు అనుకున్న వారూ, మన సహాయం పొందిన వారూ కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడటంపై పవన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి అలీ చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ గారూ మీ నుంచి నేనేం సహాయం పొందానండీ, సినిమా చాన్స్ లేమైనా ఇప్పించారా అంటూ వ్యంగ్య బాణాలు వదిలారు. అది అప్పటి సంగతి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత అలీ పరిస్థితి ఏమిటి... ఇదిగో అదిగో అని ఊరించడమే తప్ప... నాడు ఎన్నికల సమయంలో రాజమండ్రి లేదా గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి అవకాశం అడిగితే... ఎమ్మెల్యేగా కాదు అంత కంటే పెద్ద పదవి అంటూ ఊరించడం తప్ప ఈ మూడేళ్లలో అలీకి జగన్ చేసిందేమీ లేదు. రాజ్యసభ టికెట్లో,  నామినేటేడ్ పోస్టో ఇచ్చే ఉద్దేశమే నిజంగా జగన్ కు ఉంటే అలీకి ఇన్నేళ్లు ఇలా కళ్లు కాయలు కాసేలా ఏదురు చూడాల్సిన  అవసరం ఉండేది కాదు.సినిమాల్లో అందరినీ నవ్వించే కమేడియన్ అలీని జగన్ ఊరించి ఊరించి ఊసూరు మనిపించారని సామాజిక మాధ్యమంలో నెటిజన్లు జోకులేస్తున్నారు.  ఇప్పటికే నిరాశలో కూరుకుపోయిన అలీ వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  పార్టీ కోసం కష్టపడిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి కనీసం మూన్నాళ్ల ముచ్చటగానైనా ఏదో పదవి దొరికింది.. కానీ కెరీన్ ను, ఇండస్ట్రీలో సన్నిహితులతో సంబంధాలనూ ఫణంగా పెట్టి మరీ జగన్ వెంట నడిచిన అలీకి అది కూడా దొరకలేదన్న సానుభూతి  సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతోంది.

Related Posts