YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనకు దారెటు..?

జనసేనకు దారెటు..?

విజయవాడ, జూలై 6,
ఇల్లేమొ దూరం..దారంతా చీకటి....రోడ్డంతా గతుకులు... 2019 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కల్యాణ్ తరచుగా ఈ డైలాగ్ చెప్పేవారు. ఆ డైలాగ్ తన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగాల్సి ఉందన్న అర్ధంతో చెప్పినది.  అప్పట్లో అది చాలా పాపులర్ అయ్యింది. రాజకీయాలలో ప్రశ్నించడానికి,  పిడికిలి బిగించి ప్రశ్నించేందుకు నేనున్నాను అంటూ ఒక బలమైన శక్తిగా రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ ప్రస్థానంలో గమ్యం లేని బాటసారిగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.సినిమాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఆయన రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందేందుకు ప్రశ్నించడం ఒక్కటే సరిపోదనీ, ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనీ, లేదా తానే స్వయంగా సమాధానం కావాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తన రాజకీయ లక్ష్యం ఏమిటి? పార్టీని ఏ దిశగా నడిపించదలచుకున్నారు అన్న విషయంలో పవన్ లో ఇప్పటికీ స్పష్టత కానరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.పాచి పోయిపోయిన లడ్లు అంటూ 2019 ఎన్నికల ముందు బీజేపీపై ఘాటు విమర్శలు సంధించిన పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బీజేపీతోనే జట్టు కట్టడాన్ని ఆయన ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా పవన్ కు జరిగిన మేలు ఏమీ లేకున్నా సినిమాలలో హీరోగా ప్రశంసలందుకున్న ఆయన బీజేపీ మిత్రుడిగా మాత్రం కమేడియన్ స్థాయికి రాజకీయాలలో పరిమితమయ్యారని అంటున్నారు.2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలకు మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల సమయానికి ఒంటరి పోరుకే మద్దతు మొగ్గు చూపారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన నిర్ణయం వైసీపీకి నెత్తిన పాలు పొసింది. ఆ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తరువాత మూడేళ్లూ పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రపక్షంగా ముందుకు సాగారు. 2024 ఎన్నికలలో ప్రభుత్వ ఓటును చీలనివ్వనని ప్రకటించి రాష్ట్రంలో ఎన్నికల పొత్తులకు తెరతీశారు. అయితే ఆ తరువాత కొద్ది రోజులకే.. ఇంత కాలం ఇతర పార్టీలను భుజాన మోశాను ఈ సారి ఆ పార్టీలు తనను భుజాన మోయాలంటూ తన రాజకీయ ఆకాంక్ష ఏమిటన్నది చాటారు.అయితే అంతకు ముందు మూడేళ్ల పాటు బలమైన తన ఇమేజ్ ను, క్యాడర్ ను కేంద్రంలో అధికారంలో ఉన్నదన్న ఒకే ఒక కారణంతో కమలం పార్టీకి దాసోహం చేశారు. జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో మైత్రికి సుముఖత వ్యక్తం చేసేది పాము కప్పను మింగినట్ల ఆ జాతీయ పార్టీలను ఆక్రమించడానికే తప్ప వాటి అభివృద్ధికి దోహదపడేందుకు కాదన్న వాస్తవాన్ని గ్రహించడంలో పవన్ విఫలం అయ్యారు. 2019 ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన ఆ పార్టీకి కమలం పార్టీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. సరే ఎప్పుడైతే ఆయన బీజేపీ- జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకున్నారో అప్పుడే బీజేపీ ఆయనను దూరం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.దీంతో ఇప్పుడు గతంలో తాను చేసినది రాజకీయ తప్పిదమని బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక మింగలేక, కక్కలేక సతమతమౌతున్నారు. పవన్ రాజకీయ నిర్ణయాలు స్థిరంగా ఉండవని ఆయనపై తొలి నుంచీ ఒక ముద్ర ఉంది. ఇన్నేళ్ల తరువాత అంటే ఆయన జనసేన పార్టీని స్థాపించిన ఇంత కాలం తరువాత కూడా అది అలాగే కొనసాగుతోంది.అందుకు తగ్గట్టే ఆయన ప్రసంగాలూ ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కావడం తన లక్ష్యం కాదని చెబుతూనే జనం కోరుకుంటే అవుతాను అంటారాయన.  ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి జనసేన అధికారం చేజిక్కించుకునేంత సీన్ లేదని గ్రహించడం వల్లనే తాజాగా పలు సందర్భాలలో ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదు అని ఆయనే చెబుతుంటే ఎవరు మాత్రం ఆయన పార్టీకి ఓట్లు వేయాలనుకుంటారు. ప్రశ్నిస్తా, సమస్యల పరిష్కారానికి పాటు పడతా అంటే రాజకీయ పార్టీ కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉండాల్సింది అని ఆయన పార్టీలో క్రియాశీలంగా తిరుగుతున్న కార్యకర్తలే ఇప్పుడు ఆయనను నిందిస్తున్నారు

Related Posts