జర్నలిజంలో కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. మనిషే కుక్కను కరిస్తే వార్త అని వినే ఉంటారు. ఈ వార్తకు అద్దం పట్టేలా అమెరికాలో ఓ వ్యక్తి నిజంగానే కుక్కను కరిచాడు. అతడు కరించింది పెంపుడు కుక్కను కాదు.. వీధి కుక్క అసలు కానే కాదు.. ఏకంగా పోలీసు కుక్కనే కరిచి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూ హ్యాంప్‌షైర్ ప్రాంతంలో ఆదివారం ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఒకరు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో హత్యకేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులు తమను అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తున్నారని తెలిసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎటువెళ్లాలో తెలియని ఆ ఇద్దరూ తమ ఇంట్లోని వస్త్రాలన్నింటినీ కుప్పలగా వేసి కప్పుకుని దాక్కోవాలనున్నారు. ఇదే సమయంలో పోలీసుల వెంట వచ్చిన కే9 వేదా అనే తెలివైన పోలీసు కుక్క.. వీరిద్దరి జాడను పసిగట్టేసింది. దాంతో ఎలా పారిపోవాలో అర్థంకాలేదు. పట్టించిన పోలీసు కుక్క తలను గట్టిగా పట్టుకొని కొరికేశాడు. ఈ ఘటనలో కుక్క తీవ్రంగా గాయపడింది. అతన్ని వదిలించుకునే క్రమంలో కుక్క కూడా అతన్ని కరిచింది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, న్యూ హ్యాంప్‌షైర్ కెనైన్ ట్రూపర్ అసోసియేషన్ తమ ఫేస్‌బుక్ పేజీలో కుక్క కే9 వేదాకు పెద్దగా గాయాలేమీ కాలేదని, ఎప్పటిలా అది డ్యూటీకి తిరిగివచ్చిందని పోస్టు పెట్టింది. ‘కరవడం వంటి పోటీల్లోగాని పాల్గొంటే మనుషులు మాత్రం గెలవలేరని, ఎందుకంటే కరవడంలో అవి చాలా తెలివైనవి అంటూ పోలీసు శాఖ లెఫ్టినెంట్ జాసన్ కిల్లరీ వ్యాఖ్యానించారు.