న్యూఢిల్లీ, జూలై 6,
ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదం.. దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక రంగాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. తాజాగా.. మేకెన్ ఇండియా నినాదంతో గత మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70% తగ్గాయని.. ఎగుమతులు 61% పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రధానమంత్రి పిలుపు తర్వాత బొమ్మల తయారీ రంగంలో మార్పు వచ్చిందని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం అదనపు కార్యదర్శి అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తితో టాయ్ బిజ్ మంది ప్రదర్శనకారులను ఆకర్షిస్తోందని.. ఇది దేశీయంగా చిన్న, మధ్యస్థ, పెద్ద సంస్థలచే తయారైనవని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మేక్ ఇన్ ఇండియా ఈ రంగానికి సానుకూల ఫలితాలను ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భారతదేశానికి బొమ్మల దిగుమతి 2018-19లో 371 మిలియన్లు ఉండగా.. 2021-22 లో 110 మిలియన్లకు తగ్గింది. తద్వారా 70.35 శాతం తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే కాలంలో ఎగుమతులు 61.38 శాతం పెరిగాయి. బొమ్మల ఎగుమతి 2018-19లో 202 మిలియన్ల నుంచి 2021-22లో 326 మిలియన్లకు పెరిగింది. 61.39 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బొమ్మల ఎగుమతులు 109 మిలియన్లు ఉండగా.. 2021-22లో 177 మిలియన్లకు పెరిగాయి.ప్రగతి మైదాన్‌లో టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) అంతర్జాతీయ ప్రదర్శన 13వ ఎడిషన్ సందర్భంగా అనిల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. 2020 ఆగస్టులో ప్రధాని మోడీ “మన్ కీ బాత్”లో ప్రసంగంలో “ఇండియన్ టాయ్ స్టోరీని రీబ్రాండింగ్ చేయడం” అనే అంశంపై మాట్లాడారు. దేశంలో బొమ్మల లభ్యత, బొమ్మల తయారీ రంగం, భారతీయ చరిత్ర, సంస్కృతి ఆధారంగా బొమ్మల రూపకల్పనపై మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా.. భారతదేశాన్ని బొమ్మల తయారీ కేంద్రంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని.. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని పారిశ్రామికవేత్తలకు సూచించారు.