ఒంగోలు, జూలై 7,
వైసీపీ ప్లీనరీ మరికొద్దిరోజులలో జరగనుంది. సంబరాలు చేసుకోవాల్సిన సమయం. మూడేళ్లు వైఎస్ జగన్ పాలన ముగిసిన సందర్భం. కానీ వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరితో ఒకరికి పడటం లేదు. గ్రూపులు ముదిరాయి. నేతలు రోడ్డుకెక్కుతున్నారు. అధికార పార్టీలో ఇది సర్వసాధారణమయినా బహిరంగంగా వీధికెక్కడంతో ప్రజల్లో పలుచన అవ్వడం ఖాయంగా కన్పిస్తుంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ముదురుతుంది. దానిని కప్పి పుచ్చుకునేందుకు కొందరు కుట్ర కోణం అంటూ గగ్గోలు పెడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎమ్మెల్యే సక్రమంగా ఉంటే.. ఎమ్మెల్యే సమర్థుడయితే.. అందరివాడుగా నడుచుకుంటే ఎందుకు గ్రూపులుంటాయి? కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తాము ఎన్నికైన తర్వాత కష్టపడిన నేతలను వదిలేశారు. కొత్తవారిని కౌగిలించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పక్కన ఉన్న వారు ఇప్పుుడు ఎవరూ కనపడటం లేదు. అన్నీ కొత్త ముఖాలే. వారికే పదవులు. పనులు. దీంతో 2019 ఎన్నికల్లో కష్టపడి పార్టీ కోసం ఒళ్లూ, నోట్లూ గుల్ల చేసుకున్న వారికి మాత్రం ప్రాధాన్యత లభించడం లేదు. ఎమ్మెల్యేలు ఇంత గింజుకోవడం ఎందుకు? తాము చేసిన తప్పులు వారికి గుర్తుకురావడం లేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇలా ప్రముఖులే తమపై కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ నేతలే తమను వెన్నుపోటు పొడుస్తున్నారంటున్నారు. దాదాపు ఎమ్మెల్యేల్లో 60 శాతం మంది ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలు వైసీపీలో చేరిన చోట అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ తొలి నుంచి ఉన్న నేతలను ఎమ్మెల్యేలు కాదనుకుంటున్నారంటే ఎవరి తప్పిదమన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలను మాత్రమే కాదు, కార్యకర్తలను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు. గతకొద్దిరోజుల నుంచి గడప గడప కు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వారిని స్వయంగా ఆహ్వానిస్తున్నా చాలా చోట్ల అసలైన క్యాడర్ ముఖం చాటేస్తుంది. రేపు ఎన్నికల నాటికి నిజమైన వైసీపీ నేతలు, క్యాడర్ దూరం జరిగితే నష్టపోయేది వీరే. ఇప్పటికైనా కుట్రలని గొంతు చించుకుండా తమ తప్పులను ఎమ్మెల్యేలను సరిదిద్దుకుంటే మేలన్న సూచనలు విన్పిస్తున్నాయి.