విజయవాడ జూలై 8,
పార్టీ పండుగ అంటే ఎవరైనా ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తారు. కానీ పార్టీ నుంచి ఒక పెద్ద తలకాయకు ఉద్వాసన చెప్పడానికి పార్టీ పండుగను వేదికగా చేసుకోరు. ఏ పార్టీ అయినా పార్టీ వార్షికోత్సవ సభలను, ప్లీనరీలను అత్యంత ఘనంగా జరుపుకుంటుంది. ఇందు కోసం విస్తృత ఏర్పాట్లూ చేస్తారు. అందులో అసహజమేమీ లేదు. అటువంటి సభలలో సదస్సులలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే వారికి పార్టీ కండువాలు కప్పి తాము బలోపేతం అవుతున్నామని చాటుకుంటారు. అయితే వైసీపీ అధినేత జగన్ స్టైలే వేరు. ఆయన పార్టీని నడిపే తీరే వేరు వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన జగన్.. పార్టీ అధికారంలో ఉన్న ఈ మూడేళ్లలో ప్లీనరీ నిర్వహించడం ఇదే తొలిసారి.అయితే ఈ ప్లీనరీలో చేరికలు లేవు, పార్టీ విజయాల సంబరాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం పార్టీ వర్గాల ద్వారా స్పష్టమౌతున్నది ఏమిటంటే పార్టీ గౌరవాధ్యక్ష బాధ్యతల నుంచి జగన్ తల్లి విజయమ్మను గౌరవంగా తప్పించడం. ఆమె రాజీనామాతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయని పార్టీ వర్గాలే అంటున్నాయి. నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న మైదానాన్ని ఇప్పటికే ప్లీనరీ కోసం సిద్ధం చేశారు. ప్లీనరీ నిర్వహణ కోసం 20 కమిటీలు వేశారు. ఒంగోలులో జరిగిన మహానాడు విజయంతో వైసీపీ ప్లీనరీని అంతకు మించి విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్న జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్లీనరీకి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకూ వచ్చాయో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, హోమంత్రి తానేటి వనిత, మంత్రులు జోగి రమేష్ తదితరులు బుధవారం పర్యవేక్షించారు. ప్లీనరీ ఏర్పాట్లూ సన్నాహాల సంగతి పక్కన పెడితే పార్టీ గౌరవాధ్యక్షురాలిని‘గౌరవం’గా సాగనంపేందుకే ప్లీనరీ ఏర్పాటు చేశారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆమె చేతనే గౌరవాధ్యక్లురాలి పదవికి రాజీనామా చేయించి పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఏన్నుకునే కార్యక్రమానికి ఈ ప్లీనరీ వేదిక కాబోతున్నదని బెబుతున్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ బై లాస్ ను ఎన్నికల సంఘం నిబంధనలు, నియమావళికి అనుగుణంగా మార్పులు చేయబోతున్నట్లు వెల్లడించడమే ఇందుకు సంకేతమని పరిశీలకులు అంటున్నారు. అంటే అర్ధం ఏపీలో వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ, తెలంగాణలో ఆమె కుమార్తె స్థాపించిన వైఎస్సార్ టీపీకి కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాలలో రెండు పార్టీలకు గౌరవాధ్యక్షురాలిగా ఉండటం సరికాదని పరోక్షంగా చెప్పడంగానే భావించాలని పరిశీలకులు అంటున్నారు. ఇక పోతే పార్టీ గౌరవాధ్యక్షురాలిని తొలగించడం అన్నది పార్టీ బైలాస్ ను సవరిస్తే తప్ప సాధ్యం కాదు కనుక ఆమె చేతనే రాజీనామా చేయించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై తల్లికి ఇప్పటికే స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసిందంటున్నారు. కేవలం రాజీనామా విషయం ప్రకటించడానికే విజయమ్మప్లీనరీకి హాజరు కానున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.అక్రమాస్తుల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకుని మోసిన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలను పార్టీకి దూరం పెట్టడంపై జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ తీరుతో విసిగి వేసారిన సోదరి షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు. కుమారుడి తీరుతో మనస్తాపానికి గురై విజయమ్మ కూడా కుమార్తె వెంటే నడుస్తున్నారని వైసీపీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఇక ఇప్పుడు విజయమ్మ చేత పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించి ఆమెకు పార్టీతో ఎటువంటి సంబంధం లేకుండా చేయడమే లక్ష్యాన్ని జగన్ ప్లీనరీ వేదికగా నెరవేర్చుకోనున్నరని అంటున్నారు.