YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలరాజుకు సొంత పార్టీ వైసీపీలోనే సెగ

బాలరాజుకు  సొంత పార్టీ వైసీపీలోనే సెగ

ఏలూరు జూలై 8,
2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం పోలవరం. 42 వేల ఓట్లకుపైగా మెజార్టీతో నాలుగోసారి గెలిచారు తెల్లం బాలరాజు. అయితే ఎన్నికల తర్వాత నుంచి మారుతున్న పరిణామాలతో నియోజకవర్గంలో అధికారపార్టీ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పునరావాస కల్పన గతంకంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ది విషయంలో ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఎమ్మెల్యే వెనకపడ్డారన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ విషయంలో వైసీపీ లోకల్ లీడర్సే బాలరాజుపై అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన బాలరాజు.. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి మళ్లీ గెలిచినా.. కేడర్‌పై పట్టుకోల్పోయారని ప్రచారం జరుగుతోంది. సీనియారిటీకి తగ్గట్టుగా ఎమ్మెల్యే పనితనం లేదని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయట. పోలవరంలో అభివృద్ధి పనులను పట్టాలెక్కించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఏజెన్సీలో రహదారులు లేక, మౌలిక వసతులకు దూరమై.. పదే పదే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా చేయడం లేదన్నది స్థానిక కేడర్‌ చెప్పేమాట. 2014లో ఓడి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజలతో టచ్‌లో ఉన్న బాలరాజుకు 2019లో గెలిచిన తర్వాత ఏమైందో కేడర్‌కు అర్థం కావడం లేదట.పోలవరం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే.. అందులో బాలరాజు సొంతమండలమైన బుట్టాయగూడెంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలవరం, టి నరసాపురం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెంలో ఇతర పార్టీల నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణ. ఆ ప్రభావం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై పడినట్టు చెబుతున్నారు. పైగా పోలవరం వైసీపీలో ప్రస్తుతం గ్రూపులు ఎక్కవయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రూపులను ఎమ్మెల్యే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని చెబుతారు. దాంతో చాలా మంది వైసీపీ లోకల్‌ లీడర్స్‌ గడప దాటడం లేదట.పక్కపార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చి.. వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారిని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయట. కోటకు బీటలు వారకముందే ఎమ్మెల్యే బాలరాజు స్పృహలోకి వస్తే.. అన్నీ గాడిలో పడతాయని… లేకపోతే పరిస్థితులు చేయ్యి దాటిపోతుందని హెచ్చరిస్తున్నారట. మరి.. బాలరాజు ఏం చేస్తారో చూడాలి.

Related Posts