YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

ఒంగోలు జూలై 8,
మద్దిశెట్టి వేణుగోపాల్‌. దర్శి వైసీపీ ఎమ్మెల్యే. బూచేపల్లి శివప్రసాదరెడ్డి.. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే. బూచేపల్లి వెంకాయమ్మ.. ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌. అంతా వైసీపీ నేతలే. వెంకాయమ్మ కుమారుడే శివప్రసాదరెడ్డి. బూచేపల్లి వర్గానికి.. మద్దిశెట్టి వర్గానికి మూడేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరి వర్గం వారిదే. దర్శి వైసీపీలో ప్రస్తుతం రెండు పవర్‌ సెంటర్స్‌ ఉన్నాయి. అందుకే సమస్య వస్తే పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీ పెద్దలు అనేకసార్లు సయోధ్యకు ప్రయత్నించినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు అధికారుల బదిలీల విషయంలో రెండు వర్గాల మధ్య నిప్పు రాజుకుంది.జిల్లా పరిషత్‌ పరిధిలో MPDOలను బదిలీ చేశారు. సాధారణంగా మండలాల్లోని అధికారుల ట్రాన్స్‌ఫర్లు… సంబంధిత ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే.. వారి సిఫారసులకు అనుగుణంగా జరుగుతాయి. కానీ.. దర్శి, ముండ్లమూరు ఎంపీడీవోల బదిలీలు మాత్రం ఎమ్మెల్యే వేణుగోపాల్‌ ప్రమేయం లేకుండా జరిగిపోయాయట. తన సిఫారసు లేకుండా ఎవరినీ కదపొద్దని చెప్పినా.. పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారట ఎమ్మెల్యే. ఏకంగా పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే మద్దిలేటి ఆరోపణలపై బూచేపల్లి సైతం సీరియస్‌గా ఉన్నారట. దర్శి, ముండ్లమూరు MPDOల బదిలీల్లో తమ ప్రమేయం లేదన్నది బూచేపల్లి వాదన. ఎమ్మెల్యే ఎవరికీ సిఫారసు లేఖలు ఇవ్వలేదని.. అందుకే సాధారణ బదిలీల్లో వారిని కదిలించారనేది ఆయన చెబుతున్నారు.జిల్లాలో ఎంపీడీవోలను కదిలించడానికి ముందు పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదిములపు సురేష్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు బూచేపల్లి వర్గం వాదిస్తోంది. కాకపోతే దర్శిలో మాత్రం ప్రతీదీ రాజకీయ కోణంలో చూడటం వల్లే సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యేపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ విషయంలో రెండు శిబిరాలు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నా.. ఇక్కడితో విడిచి పెట్టకూడదని రెండు వర్గాలు అనుకుంటున్నాయట. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో నిర్వహించే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు.. పార్టీ ఇంఛార్జుల సమావేశంలో దర్శి రగడను ప్రస్తావించే పనిలో ఉన్నారట ఎమ్మెల్యే మద్దిశెట్టి. అంత వరకు వెళ్లితే మేము ఊరుకుంటామా.. మా వాదన కూడా మాకు ఉందని చెబుతోంది బూచేపల్లి వర్గం.ఇంకోవైపు.. బదిలీల్లో భాగంగా అధికారులు ఎక్కడికక్కడ చేరిపోయారు. విధుల్లో మునిగిపోయారు. కాకపోతే దర్శి నియోజకవర్గంలోని ఆ ఇద్దరు అధికారులు మాత్రం తమ భవిష్యత్‌ ఏంటో తెలియక సందిగ్ధంలో ఉన్నారట. ట్రాన్స్‌ఫర్లను రివర్స్‌ చేస్తారా లేక సర్దుకుపోవాలని చెబుతారో పార్టీ కేడర్‌కు అర్ధం కావడం లేదట. రెండు వర్గాలు తాడేపల్లికి ఫిర్యాదు చేసుకుంటే సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో అనే ఉత్కంఠ ఉంది. పైగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడీగా ఉండటంతో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దర్శిలో తమ పట్టు నిలుపుకొనేందుకు గట్టిగానే ఉన్నారు. మరి.. దర్శి వైసీపీలో రానున్న రోజుల్లో రాజకీయం ఇంకెన్ని సెగలు రేపుతుందో చూడాలి.

Related Posts