ఒంగోలు, జూలై 8,
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తయినా.. ఇంకా కొత్త ఓడరేవు అంశం పరిష్కారం కావడం లేదు. విభజన చట్టంలోనే రాష్ట్రానికి ఒక ప్రధాన ఓడరేవును ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఏ ప్రాంతమన్నది రాష్ట్రమే నిర్ణయించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. దీంతో ముందుగా దుగరాజపట్నాన్ని, తరువాత రామాయపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి కేంద్రానికి నివేదిక పంపించింది. దీనిపై అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడం, కొత్త ప్రాంతాన్ని గుర్తించాలని కేంద్రం కోరడంతో రాష్ట్రంలో కొత్త ఓడరేవు వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామాయపట్నం ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవుకు ఉన్న మార్కెటిరగ్ పరిధిలోకి వస్తుండడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందుగానే 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో ఓడరేవును నిర్మించేందుకు ప్రతిపాదించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన అనంతరం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దుగరాజపట్నాన్ని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇది నెల్లూరు జిల్లాలోని ఇస్రో, పులికాట్‌కు దగ్గరగా ఉండడంతో కేంద్రం దుగరాజపట్నంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రక్షణశాఖకు చెందిన ఇస్రోకు భద్రతా సమస్యలు తలెత్తుతాయని, పులికాట్ సరస్సుకు కూడా కాలుష్యం బెడద తీవ్రమవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించిన రామాయపట్నాన్నే జగన్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.ఒక పోర్టుకు 30 కిలోమీటర్ల పరిధిలో మరో పోర్టు నిర్మించకూడదన్న నిబంధన ఉంది. కృష్ణపట్నం ఓడరేవుకు ఉన్న పరిధిలోనే రామాయపట్నం ఉండడంతో దీని నిర్మాణం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. తరువాత కాలంలో దీనిని మరింతగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కృష్ణపట్నానికి 153 కిలోమీటర్ల విస్తీర్ణంలో మరో ఒడరేవు నిర్మించడం చట్టపరంగా సాధ్యం కాదు. ప్రకాశం జిల్లాలో ఉన్న రామాయపట్నం వాడరేవు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, కృష్ణపట్నం నుంచి 93 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే కృష్ణపట్నంకు ఉన్న హక్కు విస్తీర్ణంలో 60 కిలోమీటర్ల లోపలికి రామాయపట్నం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా కృష్ణపట్నం ఓడరేవుకు అదనంగా కల్పించిన 123 కిలోమీటర్ల హక్కు విస్తీర్ణాన్ని రద్దు చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి నివేదించారు. ఈ చర్యకు ఉపక్రమిస్తే కృష్ణపట్నం యాజమాన్యం న్యాయస్థానానికి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుందని వారు అంటున్నారు. ఇదే సమయంలో నాన్ మేజర్ పోర్టు అంశం కూడా కలిసొచ్చేదిగా కనిపించడం లేదు. రామాయపట్నాన్ని నాన్ మేజర్ పోర్టుగా రాష్ట్రం నోటిఫై చేసిందన్న కారణాన్ని చూపిస్తూ ప్రధాన ఓడరేవు నిర్మాణ డిమాండ్‌ను కేంద్రం పక్కనపెట్టింది. అందుకే ముందుగా రామాయపట్నాన్ని నాన్ మేజర్ పోర్టుగా చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సి ఉంటుందని కేంద్రం చెబుతోంది. తాజాగా జరిగిన ఒక సమావేశంలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు రాగా, కొత్త ప్రాంతం ఎంపిక అన్నదాన్ని కేంద్రం పునరుద్ఘాటించినట్లు తెలిసింది.