YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే హ‌త్య‌

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే హ‌త్య‌

టోక్యో జూలై 8
జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే హ‌త్య‌కు గుర‌య్యారు. ఆయ‌నపై ఇవాళ హ‌త్యాయ‌త్నం జ‌రిగిన విష‌యం తెలిసిందే. నారా సిటీలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి వెనుక నుంచి వ‌చ్చి తుపాకీతో కాల్చాడు. షింజో అబే ఛాతి, మెడ‌లోకి బుల్లెట్లు దిగిన‌ట్లు తెలిసింది. అబేను హుటాహుటిన ఆస్పిట‌ల్‌కు త‌ర‌లించి వైద్యం అందించారు. కానీ 67 ఏళ్ల షింజో అబే హాస్పిట‌ల్‌లో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు ద్రువీక‌రించారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 5.03 నిమిషాల‌కు షింజో మృతిచెందిన‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.షింజో అబే త‌న ప్ర‌ధాని ప‌ద‌వికి 2020లో రాజీనామా చేశారు. ఆరోగ్య కార‌ణాల రీత్యా ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కానీ ఆయ‌న మాత్రం రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయ‌న రెగ్యుల‌ర్‌గా మీడియాలో క‌నిపించేవారు. క‌రెంట్ అఫైర్స్ గురించి చ‌ర్చించేందుకు ఆయ‌న త‌రుచూ మీడియాలో క‌నిపించేవారు. నాటో స‌భ్యుల త‌ర‌హాలోనే అణ్వాయుధాల షేరింగ్ అంశాన్ని జ‌పాన్ చ‌ర్చించాల‌ని ఫిబ్ర‌వ‌రిలో ఓ డిబేట్‌లో తెలిపారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా అటాక్ చేసిన నేప‌థ్యంలో ఆయ‌న ఆ అభిప్రాయాన్ని వినిపించారు.శుక్ర‌వారం నారా ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న స‌య‌మంలో ఓ ఆగంత‌కుడు షింజోపై కాల్పులు జ‌రిపాడు. ఎగువ స‌భ‌కు ఎన్నిక‌ల నేప‌థ్యంలో లిబ‌ర‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున షింజో ప్ర‌చారం నిర్వ‌హించారు. నారా త‌ర్వాత క్యోటో, సైతామాలో ఆయ‌న ప్ర‌చారం చేయాల్సి ఉంది. జ‌పాన్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా చేసిన వ్య‌క్తిగా అబేకు గుర్తింపు ఉన్న‌ది. 2006 నుంచి 2007, ఆ త‌ర్వాత 2012 నుంచి 2020 వ‌ర‌కు ఆయ‌న ఆ దేశ ప్ర‌ధానిగా చేశారు.

Related Posts