YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గ్రావెల్‌ తవ్వకాలపై వైసీపీలో వర్గపోరు

గ్రావెల్‌ తవ్వకాలపై వైసీపీలో వర్గపోరు

నెల్లూరు, జూలై 11,
పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో భూములకు డిమాండ్‌ ఎక్కువ. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు.. కోవూరు.. విడవలూరు మండలాల్లో గ్రావెలతోపాటు ఇసుక అధికంగా లభిస్తుంది. ఇవే స్థానిక వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సైతం ప్రస్తుతం చర్చగా మారింది. అధికారపార్టీ వర్గాల్లోనే కుమ్ములాటలకు.. వర్గపోరుకు.. కేడర్‌కు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరగడానికి కారణమైందని చెబుతున్నారు.కోవూరు నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ నేతలను ఇంఛార్జులుగా నియమించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి. వారికే పూర్తి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆ నాయకులు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ సమస్యలు సృష్టిస్తున్నారని పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. మూడేళ్లుగా ఇదే జరుగుతున్నా ఎమ్మెల్యే లైట్‌ తీసుకుంటున్నారట. కొడవలూరులో DCMS అధ్యక్షుడు చలపతిరావు చెప్పిందే వేదంగా మారిపోయిందట. అక్కడేం జరగాలన్నా చలపతిరావు అనుమతి కావాలని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇటీవల మండలంలో గ్రావెల్‌ తవ్వకాలపై వైసీపీలో వర్గపోరు మొదలైంది. సమస్య ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. అన్నీ విన్న ప్రసన్నకుమార్‌రెడ్డి ఏదీ పట్టించుకోలేదట.విడవలూరు మండలంలో వైసీపీ నేతల మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయట. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేశారని గుప్పుమంది. ఆ సంఘటనపై మాత్రం ప్రసన్న కుమార్‌రెడ్డి భగ్గుమన్నారు. ఇందుకూరుపేట మండలంలో పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి, ఆదిశేషారెడ్డిలపై మరో నేత సురేష్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నేతల అవినీతి చిట్టా బయటపెడతానని సురేష్‌రెడ్డి చెప్పడంతో కలకలం రేగింది. కొందరు నాయకులైతే.. జనాల్లో డ్యామేజీ అవుతోందని భావించి.. నేరుగా ఎమ్మెల్యే దగ్గర పంచాయితీ పెట్టారట. పార్టీలో వారైనా ఉండాలి లేదాంటే మేమైనా వెళ్లిపోతామని తెగేసి చెప్పారట.బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వైసీపీ నేత సూరా శ్రీనివాసరెడ్డి సర్వం తానై వ్యవహరిస్తున్నారట. ఇక్కడ ఇసుక, గ్రావెల్‌ తవ్వకాలపై నిత్యం తగువే. కొందరు కోట్లు గడించారని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. పైగా వైసీపీకి మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి ఎలా పెత్తనం ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అయితే ఎమ్మెల్యేకు స్నేహితుడిగా ఉన్న తనను ఎవరూ ఏమీ చేయలేరని ఒక నాయకుడు చేస్తున్న ప్రకటనలు కేడర్‌ను దిక్కతోచని స్థితిలో పడేస్తున్నాయి. ఈ మండలంలో జరుగుతున్న వ్యవహారాలను కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక కోవూరు మండలంలోనూ ఇదే పరిస్థితి ఉందట. అక్కడా వాటల కోసం పార్టీ నేతలు గొడవలు పడుతున్నారు.మొత్తానికి ఒక్కో మండలాన్ని ఒక్కో నేతకు అప్పగించి.. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఏదీ పట్టించుకోవడం లేదనే వైసీపీ కేడర్‌ గుర్రుగా ఉంది. తనకు కావాల్సిన వాళ్లకు మండలాలు రాసిచ్చేసి.. అక్కమార్జనకు లైసెన్స్ ఇచ్చారని పార్టీ నేతలే వాపోతున్నారు. సొంత పార్టీ వాళ్లకే మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందని కేడర్‌ గగ్గోలు పెడుతోంది. అన్నీ తెలిసిన ఎమ్మెల్యే ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదట.

Related Posts