YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాజీ మంత్రిగారి జోక్యంపై ఫిర్యాదులు

మాజీ మంత్రిగారి జోక్యంపై ఫిర్యాదులు

అనంతపురం, జూలై 11,
అధికారులు బదిలీపై వెళ్తే.. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యే, కలెక్టర్, లేదా మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాత్రం పూర్తి డిఫరెంట్. ఇక్కడికి ఎవరొచ్చినా.. ఏం జరగాలన్నా ముందుగా ఎమ్మెల్యే సోదరులను కలవాలట. ఇక్కడ ఎమ్మెల్యే మొన్నటి వరకు మంత్రిగా చేసిన శంకర నారాయణ. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినా.. 2019లోనే కేబినెట్‌లో చోటు కొట్టేశారు. ఇందుకు సామాజికవర్గం సమీకరణాలు కలిసొచ్చాయి. శంకర నారాయణ ఎమ్మెల్యే కాకముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఆ సమయంలో పెద్దగా చర్చల్లో ఉండేవారు కాదు శంకర నారాయణ. కానీ.. మంత్రి అయ్యాక వివాదాలు గట్టిగానే ముసురుకున్నాయి. సొంత పార్టీవాళ్లే ఆయనపై తిరుగుబాటు చేసేంతగా పరిణామాలు మారిపోయాయి. తాడేపల్లి వరకు ఫిర్యాదులు వెళ్లాయి.ఇక్కడో సంగతి ప్రత్యేకంగా చెప్పుకొంటాయి పార్టీ వర్గాలు. పెనుకొండలోని వైసీపీ నేతలు, కార్యకర్తల కోపం శంకర నారాయణపై కాదట. ఆగ్రహం అంతా ఆయన సోదరులపై అని ఓపెన్‌గానే చెబుతారు. మాజీ మంత్రికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఒకరు రవి.. ఇంకొకరు మల్లికార్జున్‌. శంకర నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ఫుల్‌ బిజీ. ఆ టైమ్‌లో పెనుకొండలో పెత్తనం ఆయన సోదరులదే. వారిలో రవి మరీ దూకుడుగా వెళ్లేవారట. కేవలం రాజకీయ కార్యకలాపాలకే కాకుండా.. అధికారికంగా శంకర నారాయణ చేయాల్సిన పనుల్లోనూ జోక్యం చేసుకునేవారట తమ్ముళం వారు. ఆ విధంగా నియోజకవర్గంలో మొత్తం పట్టు సాధించారని టాక్‌. పెనుకొండలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పని జరగాలన్నా శంకర నారాయణ సోదరులకు తెలియాల్సిందేనట. ఈ వైఖరి కొత్తలో బాగానే ఉన్నా.. రాన్రానూ శ్రుతిమించినట్టు చెబుతున్నారు. ఫలితంగా వైసీపీ లోకల్‌ లీడర్సే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. శంకర నారాయణ మంత్రిగా ఉన్నంతకాలం ఉగ్గబెట్టుకుని ఉన్న అసంతృప్తి నేతలు.. ఆయన కేబినెట్‌లో చోటు కోల్పోగానే బయటకొచ్చారు. ఆయన వ్యతిరేకులంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అది నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. తాజాగా ఒక ఉద్యోగిని విషయంలో మాజీ మంత్రి సోదరులు వ్యవహరించిన తీరు చర్చగా మారింది. పెనుకొండ MPDO ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక ఉద్యోగిని బదిలీపై పరిగి మండలానికి వచ్చారు. జాయినింగ్ రిపోర్ట్‌ ఇవ్వబోతుంటే.. అక్కడి ఎంపీడీవో షాక్‌ ఇచ్చారట. ముందుగా వెళ్లి శంకర నారాయణ సోదరుల పర్మిషన్‌ తీసుకోవాలని.. ఆ తర్వాత డ్యూటీలో చేరాలని సెలవిచ్చారట. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఆ మహిళా ఉద్యోగి భర్త  వైసీపీ నాయకుడు. ఆయన శంకర నారాయణ వ్యతిరేకవర్గం కావడంతోనే అలా చేశారని నియోజవర్గంలో గుప్పుమంది. ఆ వర్గపోరు కారణంగా ఆ ఉద్యోగినికి అక్కడ పోస్టింగ్‌ క్యాన్సిల్‌ చేసి మడకశిర పంపేశారట. పెనుకొండలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయన్నది వైసీపీ అసంతృప్తులు చెప్పేమాట. శంకర నారాయణ ఇద్దరు సోదరుల్లో రవి వైఖరిపైనే పార్టీ వర్గాలకు ఎక్కువ అభ్యంతరాలు ఉన్నాయట. ఆయన లక్ష్యంగానే సోషల్‌ మీడియాలో ఏకి పడేస్తున్నట్టు టాక్‌. తమ్ముడు.. కుమ్ముడు అని గట్టిగానే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఇదంతా తెలిసినా మాజీ మంత్రి శంకర నారాయణ ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే కేడర్‌కు అర్థం కావడం లేదట.

Related Posts