ఏలూరు జూలై 11,
ఏలూరు జిల్లాలో అధికార వైసీపీలో ఈ సారి భారీ మార్పులు, చేర్పులు తప్పేలా లేవు. జగన్ ఎలాగూ30 మంది నుంచి40 మంది వరకూ సిట్టింగ్‌లను పక్కన పెట్టేస్తున్నట్టు సొంత పార్టీ నేతలకే చెపుతున్నారు. మిగిలిన జిల్లాల సంగతి ఎలా ఉన్నా ఏలూరు జిల్లాలో ఉన్న 8 ( 7 పూర్తి సెగ్మెంట్లు, 1 సెగ్మెంట్ పాక్షికంగా) సీట్లలో మెజార్టీ సిట్టింగ్‌లు అవుట్ కానున్నారు. ఆ అవుట్ అయ్యే సిట్టింగ్ ప్లేసుల్లో కొత్త పేర్లు కూడా తెరమీదకు వచ్చేశాయి. అవుట్ అయ్యే ఎమ్మెల్యేల్లో చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజా, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఫస్ట్ లిస్టులోనే ఉన్నట్టు పార్టీ హైకమాండ్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఎలీజా విషయానికి వస్తే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్ సొంత నియెజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. ఇది శ్రీథర్‌కు కంచుకోట. ఆయన వర్గం బలంగా ఉండడంతోనే ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఇక్కడకు వచ్చినా ఎలీజా నియోజకవర్గ చరిత్రలోనే లేని విధంగా 36 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే గెలిచిన యేడాదిన్నర నుంచే బలంగా ఉన్న ఎంపీ, ఆయన అనుచరగణంతో ఎలీజా ఢీ అంటే ఢీ అంటున్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే నియోజకవర్గంలో మూడొంతులకు పైగా ఉన్న ప్రజాప్రతినిధులు, 80 శాతం మంది కీలక నాయకులు ఎలీజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తే చేసే పరిస్థితి లేదని ఖరాఖండీగానే చెప్పేస్తున్నారు. ఎలీజాకు ఎంపీతో గొడవ వద్దని సమన్వయంతో ఉండాలని అధిష్టానం చెపుతున్నా ఆ మాటను పెడచెవిన పెట్టేస్తున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎలీజాకు ఈ సారి టిక్కెట్ రాకుండా ఎంపీ వర్గం చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. చింతలపూడి వైసీపీ టిక్కెట్ రేసులో ప్రభుత్వ అధికారి కంభపు విజయరాజు ముందు ఉన్నారు. పైగా చింతలపూడి టిక్కెట్‌ను వైసీపీ మాల వర్గానికే ఇవ్వాలని చూస్తుండడం.. విజయరాజు ఆ వర్గానికి చెందిన వ్యక్తే కావడం.. ఇటు శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు ఆయనకు వియ్యంకుడు కావడం.. ఎంపీ కోటగిరి శ్రీథర్ మద్దతు పుష్కలంగా ఉండడంతో ఆయనకు సీటు విషయంలో తిరుగులేకుండా ఉంది. ఆర్థిక, అంగ బలాలు కూడా కలిసి రానున్నాయి. దూలం అవుట్.. భయంకరమైన వ్యతిరేకత సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటోన్న నేతల్లో దూలం నాగేశ్వరరావు కూడా ముందు వరుసలో ఉన్నారు. అసలు ఆయనపై గత యేడాది కాలంగా సొంత పార్టీ నేతలే బహిరంగంగా ప్రెస్‌మీట్లు పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధిష్టానంకు దూలంపై సొంత పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు వెళుతున్నాయి. పార్టీని కంట్రోల్ చేసే కోర్ టీం కీలక నేత కూడా దూలంకు టిక్కెట్ లేదని ఇప్పటికే నియోజకవర్గ నేతలతోనే అన్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో బీసీని దింపుతుందా ? లేదా ? అన్న ఈక్వేషన్‌ను బట్టి కైకలూరు వైసీపీ క్యాండెట్ ఎవరు ? అన్నది డిసైడ్ కానుంది. వైసీపీ ఈ సారి కైకలూరు, ఉంగుటూరుల్లో ఓ సీటును ఖచ్చితంగా బీసీకి ఇవ్వనుంది. ఏదేమైనా దూలం మాత్రం అవుట్ కానున్నారు. ఇక గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరిస్థితి రోజు రోజుకు అగమ్యగోచరంగా మారుతోన్న వాతావరణమే ఉంది. తీవ్రమైన వ్యతిరేకతతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల జరిగిన ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లి సంఘటన తర్వాత ఆయనపై సొంత పార్టీలోనే బలమైన వర్గాలు గుర్రుగా ఉన్నాయి. నాలుగు మండలాల్లో బలమైన వ్యక్తులు ఆయన నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఆయనకు టిక్కెట్ రాదన్న సంకేతాలు రావడంతో గతంలో ఇక్కడ ఓసారి గెలిచి మంచి పట్టున్న ప్రస్తుత హోం మంత్రి తానేటి వనిత 2024లో ఇటు వైపు దృష్టి సారిస్తున్నారు. అలాగే జగన్‌కు బాగా నమ్మకస్తుడు అయిన ఓ ప్రభుత్వ అధికారి కూడా ఈ సీటు రేసులో ఉన్నారు. అటు హోం మంత్రి వనితతో పాటు సదరు ప్రభుత్వ అధికారి ఇద్దరికి జగన్, పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి. ఏదేమైనా జిల్లాలో ఎన్నికల వేళ చివర్లో జరిగే మార్పుల సంగతి ఎలా ? ఉన్నా ఈ మూడు సీట్టింగ్‌ల సీట్లు ఎగిరిపోవడం అయితే ఖాయమనే చర్చ ఆ పార్టీ అధిష్టాన వర్గాల్లోనే నడుస్తోంది.