ఒంగోలు, జూలై 11,
‘మేనిఫెస్టో అంటే భగవద్గీత.. మేనిఫెస్టో అంటే ఖురాన్.. మేనిఫెస్టో అంటే బైబిల్.. అధికారం అంటే అహంకారం కాదు అధికారం అంటే ప్రజల మీద మమకారం. ఈ మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేశాం’.. ఇవీ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ప్లీనరీ వేదిక నుంచి చెప్పిన మాటలు. భగవద్గీత లాంటి, ఖురాన్ లాంటి, బైబిల్ లాంటి తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చి ఉంటే.. రాష్ట్రం ఎందుకు ఇంత అధ్వాన్నంగా తయారైందో.. ఎందుకు ఇంతలా దిగజారిపోయిందో.. ఎందుకు అభివృద్ధి అనే మాటకు అర్థం లేకుండా రాష్ట్రం అధోగతి పాలైందో.. ఇన్ని మాటలు చెప్పిన జగన్ రెడ్డికైనా అర్థమవుతోందా? అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. రెడ్డి గత ఎన్నికల ముందు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన 95 శాతంలో పోలవరం ప్రాజెక్టు లేదా? పరుగులు పెట్టిస్తామన్న అమరావతి నిర్మాణం లేదా? 25 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న హామీ లేదా? రైతులకు ఉచితంగా వేయిస్తామన్న బోర్లు లేవా? 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇస్తానన్న పింఛను సంగతేమిటి? కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైందనే ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి. అంటే తాను నెరవేర్చిన 95 శాతం హామీల నుంచి వీటిని మినహాయించారా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు ట్రోల్ అవుతున్నాయి.ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం, ప్రజా రాజధాని అమరావతిని అటకెక్కించడం, ఏపీకి ప్రత్యేక హోదా గురించి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద ఇస్తానన్న 12 వేల 500 రూపాయలు ఇచ్చిందెక్కడ? కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానన్న హామీ ఏమైందని జనం జగన్ రెడ్డిని నెటిజనులు నిలదీస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నెలలోనే విడుదల చేస్తానని గొప్పలు చెప్పిన ఉద్యోగ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వేస్తానన్న జగన్ మెగా డీఎస్సీ హామీ ఏమైంది స్వామీ అంటున్నారు. టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అన్న క్యాంటీన్లలో అవినీతి ఏదో జరిగిపోయిందని, ఆ అవినీతిని బయటపెట్టి, మూడు నెలల్లోనే రాజన్న క్యాంటీన్లు పెట్టేస్తానని చెప్పిన మాటలు నీటిమూటలేనా? కడప ఉక్కు కర్మాగారం ఏమైందని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. రాష్ట్రంలోని పేదలకు తెల్ల రేషన్ కార్డుపై సన్నబియ్యం అందిస్తానని చెప్పిన మాట తప్పలేదా? మడమ తిప్పలేదా అని నిలదీస్తున్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు సీపీఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన భరోసా ఏ భోషాణంలో దాచారని అడుగుతున్నారు.