విజయవాడ, జూలై 12,
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దేశంలోని ప్రధాన పార్టీలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసేసుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకు టీడీపీ నిర్ణయం ఏంటన్నది బయటకు రాలేదు. పార్లమెంటులో.. అసెంబ్లీలో పెద్దగా ప్రభావం చూపని స్థితిలో టీడీపీ సభ్యులు ఉన్నారు. జగన్‌కు జైకొట్టగా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశానికి ఉన్నారు. అందుకే టీడీపీ మద్దతు కావాలని ఏ పక్షమూ ఇంత వరకు అడగలేదని తెలుస్తోంది. పైగా హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ఉందట టడీపీ.టీడీపీ వర్గాల్లోనే దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో రాష్ట్రపతి ఎన్నికలంటే టీడీపీ కీలక పాత్ర పోషించిన సందర్బాలు ఉన్నాయి. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. అలాంటిది ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో.. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ ఇలా ఎవ్వరూ చంద్రబాబును.. టీడీపీని పలకరించలేదు. గతంలో జాతీయస్థాయిలో చక్రం గిర్రున తిప్పిన స్థితి నుంచి అసలు మద్దతు కూడా కోరాల్సిన అవసరమే లేదనే రీతిలో జాతీయ స్థాయిలో టీడీపీ ఇమేజ్ పడిపోయిందని పార్టీ వర్గాలు నిట్టూరుస్తున్నాయి.గతంలో రాంనాధ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీకి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎంపీల మద్దతు కోరారు. ప్రస్తుతం అలా మద్దతు కోరే సంగతి దేవుడెరుగు.. అసలు ఏపీలో టీడీపీ అనే పార్టీ ఉందనే విషయాన్ని మరిచిపోయినట్టు జాతీయ పార్టీలు వ్యవహరించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ప్రత్యక్షంగా కాకున్నా.. కనీసం ఫోనైనా చేయకపోవడంపై పసుపు శిబిరాన్ని ఆందోళనలో పడేసిందట. గతంలో స్థానిక పరిస్థితులను వదిలేసి.. జాతీయ రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన పాపానికి.. ఇప్పుడు రాష్ట్రంలోనూ.. జాతీయ స్థాయిలోనూ టీడీపీ అవమానాలను ఎదుర్కొంటుందనే చర్చ పార్టీలోనే ఉందట. వాస్తవాలను విస్మరించి.. శక్తికి మించిన అంచనాలతో ఏదేదో ఊహించుకుని రాజకీయం చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని కొందరు తెలుగు తమ్ముళ్లు దెప్పిపొడుస్తున్నారట.