గుంటూరు, జూలై 12,
ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవమో ఏమో.. అభ్యర్థుల విషయంలో గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఆయన రూటు మార్చేశారని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మహానాడు తర్వాత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాంటిదో చంద్రబాబు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో గమనిస్తోంది పార్టీ కేడర్. ఎప్పుడూ లేనట్టుగా టీడీపీని వన్ వేలో తీసుకెళ్తున్నారని చర్చ జరుగుతోంది. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఎక్కడా చూద్దాం.. చేద్దాం అనే మాటలు కాకుండా.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.మూడు రోజుల పర్యటనలో తొలిగా మదనపల్లె, రెండో రోజు పీలేరు తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారని అనుకుంటే.. అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అభ్యర్థుల ప్రకటన జాప్యం వల్ల ఓడిపోతున్నామని మీటింగ్‌కు ముందు ఆవేదన చెందిన నేతలకు ఆయన షాక్ ఇచ్చారు. పీలేరు సహా, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల సమీక్షల్లో సూటిగా సుత్తిలేకుండా తన అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పేశారు. అభ్యర్థులు ఎవరో ఏంటో.. సంకేతాలు ఇచ్చేశారు. ఇదే టీడీపీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది.వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందనే చర్చ టీడీపీలో ఉంది. చంద్రబాబు పర్యటనలో ఆ ఉసే లేకుండా.. ప్రకటనలు వచ్చాయి. పీలేరులో నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి, పుంగనూరులో చల్లా బాబు గెలుస్తారని టీడీపీ అధినేత చెప్పారు. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, మదనపల్లిలో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్న వారికి క్లాస్ తీసుకున్నారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి, కొత్తగా టీడీపీలో చేరిన గంటా నరహరిలను పరిచయం చేస్తూనే.. ఇద్దరినీ సర్దుబాబు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఒకరిని కడప పార్లమెంట్‌కు.. మరొకరిని రాజంపేటకు పంపుతామని చెప్పారు. గతంలో డోన్‌లో సుబ్బారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలోనే పొత్తులపై ఆలోచించకుండా చంద్రబాబు అలా ఎలా ప్రకటన చేస్తారని చర్చ సాగింది. తాజా పర్యటనలో ఆయన మరింత దూకుడు ప్రదర్శించారు.నగరిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో వన్ మ్యాన్ షో చేశావని గాలి భాను ప్రకాష్‌ను అభినందిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పేశారు. ఇలా టూర్ చేసిన ప్రతీచోటా అభ్యర్థులపై స్పష్టత ఇస్తూ వెళ్లడం తమ్ముళ్లను ఆలోచనలో పడేస్తోంది. పొత్తులు లేకుండా ఎన్నికల్లో సింగిల్‌గా వెళ్లడానికే టీడీపీ అధినేత నిశ్చయించుకున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పొత్తులు కుదిరినా సులువుగా గెలిచే సీటును ఎందుకు ఇవ్వాలనే ఆలోచన కావొచ్చని మరికొందరు అభిప్రాయ పడుతున్నారట. అదే నిజమైతే అప్పట్లో కుప్పంలో వన్‌సైడ్ లవ్ అని పవన్ కల్యాణ్‌కు ఎందుకు ఆఫర్ ఇచ్చారనేవాళ్లూ ఉన్నారు.జిల్లాలో జనసేన నేతలు మదనపల్లె, రైల్వే కోడూరు సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే ఆ రెండు అడగాలని చూస్తున్నారట. కానీ.. చంద్రబాబు తాజా ప్రకటనలు.. జనసేన శ్రేణులను సందిగ్ధంలో పడేశాయట. మరి.. వన్‌వేలో సైకిల్‌ను తీసుకెళ్లడం వెనక టీడీపీ అధినేత ఉద్దేశం ఏంటో కాలమే చెప్పాలి.